కులగణనపై కాంగ్రెస్‌ నేత అసమ్మతి వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కులగణనపై కాంగ్రెస్‌ నేత అసమ్మతి వ్యాఖ్యలు

Published Thu, Mar 21 2024 6:21 PM

Caste Census: anand sharma says Disrespecting Indira Rajiv Gandhi Legacy - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ​కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్‌ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్‌​ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు.  అదేవిధంగా 1980 ఎ‍న్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని  తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీ..  దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే  ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్‌ శర్మ అ‍న్నారు.

ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి  కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో  గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే  భారత సమాజంలో కులతత్వ  రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్‌ శర్మ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు.

ఇక గత కొన్ని రోజులుగా  ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన  ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్‌ కుల గణన హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement