కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.?.. మల్లు రవితో భేటీ!.. హస్తం వైపే జూపల్లి కూడా!

BRS MLC Kuchukulla Damodar Reddy Likely To Join Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైపోగా..  మరోవైపు జూపల్లి సైతం హస్తం వైపే మొగ్గ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) జూపల్లి కృష్ణారావుతో కాంగ్రెస్‌ సీనియర్‌ మల్లు రవి భేటీ అయ్యి.. చేరిక గురించే చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈలోగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 

పాలమూరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ  కూచకుళ్ల దామోదర్ రెడ్డి, మల్లు రవితో భేటీ కానున్నట్లు సమాచారం. తన తనయుడు రాజేష్‌తో సహా ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వర్గీయులపై.. ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని దామోదర్‌రెడ్డి.. తన వర్గీయుల వద్ద ప్రస్తావించినట్లు భోగట్టా. అదే విధంగా తనయుడు రాజేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. పార్టీ మారాలని దామోదర్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. విడిగా కాకుండా జూపల్లి కృష్ణారావుతో పాటే చేరితే మరింత మేలు జరగవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వర్గీయులు చెబుతున్నారు. 

తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి.  ఇదిలా ఉంటే మల్లు రవితో పాటు కొల్లాపూర్ నియోజక వర్గ నేత జగదీశ్వర్ రావుతోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఈ వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్‌ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే  ఆ తర్వాత టీఆర్‌ఎస్‌(ఇప్పుడు బీఆర్‌ఎస్‌)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. 

ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో ఇలాగైతే కష్టమే!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top