
ఖమ్మం లోక్‌సభ సన్నాహక సభలో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్‌కు ప్రమాదం. సీఎం అనే రెండు అక్షరాలకంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్‌ఫుల్. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే పోరాట పటిమ చూపగలుగుతాం. మనమంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమే.
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ బీఆర్‌ఎస్ పోరాట పటిమను ప్రజలు చూశారు. ఇక రాబోయే రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..’అని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు
‘ప్రస్తుతం పార్టీ పరంగా జరుగుతున్న పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయి. త్వరలో బీఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రెండు మూడు నెలలకోమారు అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తాం..’అని కేటీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ దళంగా ముందుకు సాగుదాం
‘తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్‌ను గెలిపించినా, ఏడాదిన్నరలోనే ప్రజలు ఆ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొనే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాగ్దానాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కాలయాపన చేస్తోంది.
హామీల అమల్లో కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రజల్లో అసహనం మొదలైంది. ఈ నేపథ్యంలో హామీల అమలు కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేలా బీఆర్‌ఎస్ చేసే పోరాటానికి పార్టీ యంత్రాంగం కార్యోన్ముఖులు కావాలి. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిపై సమీక్షించుకోవడంతో పాటు, పార్టీ పరంగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం. తెలంగాణ గళం, బలం బీఆర్‌ఎస్ పార్టీయే. రాబోయే ఎన్నికల్లో ‘కేసీఆర్ దళం’గా ఐకమత్యంతో ముందుకు సాగుదాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
దళితబంధు ఇచ్చినా ఓట్లు పడలేదు
‘మధిర నియోజకవర్గం పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు.. 2019లో ఓడినా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చాం. మధిర మండలం చింతకాని మండలంలో లబ్ధిదారులందరికీ దళితబంధు ఇచ్చినా కమల్‌రాజ్‌కు ఓట్లు పడలేదు. ఆయన నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఆయన గొంతు కోసిందంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నా. ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ టికెట్‌తో పాటు రూ.40 లక్షల చెక్కు ఇచ్చి పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం..’అని కేటీఆర్ చెప్పారు.
ఇక మీ కోసం మీ దగ్గరకే: మాజీ మంత్రి హరీశ్
‘బీఆర్‌ఎస్ ఓటమి తాత్కాలికం. భవిష్యత్తు అంతా మనదే. కాంగ్రెస్ పాలనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయి. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు గనుక పూనుకుని ఉంటే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారు. కేసీఆర్‌కు అభివృద్ధి తప్ప పగతనం తెలియదు..’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ఇకపై మేం హైదరాబాద్‌లో ఉండం. మీ కోసం మీ దగ్గరకే వస్తాం. నాలుగు రోజులు ఓపిక పడితే ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌కే అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తారు..’అని స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందినా వ్యతిరేక ఫలితాలు: నామా
కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెందినా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామంటూ, పార్లమెంటు ఎన్నికల కోడ్ వెలువడే లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటులో తెలంగాణ గొంతుగా బీఆర్‌ఎస్ నిలిచిందని, గత ఐదేళ్లలో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్‌ఎస్ ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఎంపీ రవిచంద్ర, మాజీ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మదన్‌లాల్, కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.