
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలోకి చేరారు. నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్‌రావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పరిస్థితి సున్నా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి 2023 ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లు వచ్చాయని 2024లో 36 శాతం ఓట్లు వచ్చాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు.. ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాతే బీజేపీలోకి చేరానని తెలిపారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో జర్నీ ప్రారంభిస్తానన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో జనాల్లోకి తీసుకువెళ్లడానికి తాను సిద్ధమన్నారు. బీజేపీలో చేరుతుంట బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని.. అనవసరంగా బీఆర్‌ఎస్ చేరికపై చర్చించవద్దని కోరుతున్నానని బాలరాజు అన్నారు.