
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్‌ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నోటీసులకు భయపడే ప్రశ్నే లేదు: సంజయ్
లీగల్ నోటీసులకు భయపడే ప్రశ్నే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గేమ్ ఆన్. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు. నిజం ఒక సింహం.. దాన్ని విడిచిపెడితే అది తనను తాను రక్షించుకుంటుంది. ఫోన్‌ట్యాపింగ్ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్తులు బయటపడతారు. సత్యమేవ జయతే’అని పేర్కొన్నారు.