
సాక్షి, తెలంగాణ భవన్: లొట్టపీసు కేసులతో సీఎం రేవంత్ చేసేది ఏమీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణాలు, ఇతర అంశాలపై మాట్లాడారు.
‘తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్యారేజ్‌లో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. టైమ్ పాస్ కోసమే కమిషన్ నోటీసులు పంపింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అందాయో? లేదో? తెలియదు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుంది.
మిస్ వరల్డ్ ప్లెక్సీలో రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు ఫొటోలు ఉన్నాయి. వీరిలో ఎవరు మిస్ వరల్డో అర్థం కావడం లేదు. కమిషన్లు దండుకోవడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.కేసీఆర్ వరంగల్‌కు కదలగానే ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే కమిషన్ నోటీసుల పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిజం నిలకడగా తెలుస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనైపోయింది. లొట్టపిసు కేసులతో ఏం కాదు. కోటిమంది మహిళలను కోటీశ్వరలను చేస్తామని అంటున్నారు. అవి అలవికాని హామీలు. ప్రతిపక్షంలో ఉంటూ రేవంత్ నిద్ర పట్టకుండా చేస్తున్నాం. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని నిలదీస్తున్నాం’ అని అన్నారు.
జూన్ ,జూలైలో బీఆర్‌ఎస్ నూతన మెంబర్షిప్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి కట్టుగా చేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు.
