
సాక్షి, విశాఖ: చంద్రబాబు(Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) మండిపడ్డారు. కానీ, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడూ ఒకే మాట మాట్లాడుతారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు.
ఈనెల తొమ్మిదిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) విశాఖ పర్యటనపై నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఏడు నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ రోడ్ షోగా వెళ్ళే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్, షుగర్ ఫ్యాక్టరీ, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వైఎస్ జగన్ కలవనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకమే. కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి.
చంద్రబాబులా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్‌లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి. కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది. పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు చీటర్, లోకేష్(Nara Lokesh) లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?