
ఎమ్మెల్సీల ఫిరాయింపుపై త్వరలో పిటిషన్ వేయాలి
బీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు కేసీఆర్ ఆదేశం
బీసీ రిజర్వేషన్ల పెంపుపై సర్కారు చేతులెత్తేసిందని వ్యాఖ్య
14న బీసీల కదన భేరి ఏర్పాట్లపైనా చర్చ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జరుగుతున్న సన్నద్ధతపై ఆరా తీశారు.
ఢిల్లీలో న్యాయవాదులు కోరిన విధంగా పూర్తి సమాచారాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కేసీఆర్ సోమవారం ఎర్రవల్లి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు
రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించడంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన పరిణామాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశముందని సమావేశంలో నేతలు అంచనా వేశారు. ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీఆర్‌ఎస్ నిర్వహించే ‘బీసీల కదన భేరి’ సభ ఏర్పాట్లపైనా చర్చించారు. సభలో రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ప్రస్తావించి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు.
బనకచర్లపై దిశా నిర్దేశం
ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై ఇటీవల ఢిల్లీలో న్యాయ నిపుణులతో హరీశ్ జరిపిన సంప్రదింపులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలకు పార్టీ పరంగా చెక్ పెట్టేలా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధతపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. దీనిపై చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం.
విలీనం ప్రచారాన్ని తిప్పికొట్టాలి
‘ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి పదేళ్లు అధికారంలో కొనసాగి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతర పోరాటం చేస్తోంది. కానీ బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతోందని కొందరు ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లక ముందే విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి..’ అని బీఆర్‌ఎస్ అధినేత ఆదేశించారు.