
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శ
రైతు బీమా గతంలో మాదిరిగా రెన్యువల్ చేయాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం గ్యా రెంటీగా ఖతం పట్టించిందని అన్నారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ.. రేవంత్‌రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజా రిందని సోమవారం ఒక ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే రూ.20,266 కోట్లు అప్పు
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.20,266 కోట్లు ప్రభు త్వం అప్పుగా తీసుకుంది. వార్షిక ల క్ష్యంలో ఇది 37.5 శాతం. కొత్తగా ఏ రోడ్లు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులను ఏం చేస్తున్నారు? పన్నేతర ఆదా యం కూడా దారుణంగా పడిపోయింది.
బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అ యింది. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పు డు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం అసమర్థ పాలనకు నిదర్శనం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడి లో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదు
కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుందని, ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని కేటీఆర్ విమర్శించారు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే..ఎక్కా దిగా సరిపోయిందన్న చందంగా ప్రభుత్వం తీరుందని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. ‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు బీమా పథకం కింద 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించాం.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా ప్రీమియం చెల్లించలేదు. వేలాదిమంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ. అయితే గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతు స్వయంగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు కూడా అందజేయాలనే నిబంధన విధించారు. ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రైతుబీమాకు రైతులు మళ్లీ దరఖాస్తు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మూర్ఖత్వం. గతంలో మాదిరిగానే ప్రభుత్వం రైతు బీమా రెన్యువల్ చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.