
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ అభయహస్తం.
ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తం
కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేత ప్రదీప్ చౌదరి
సాక్షి, హైదరాబాద్: ‘బాకీ కార్డు’ఉద్యమంతో కాంగ్రెస్ సర్కార్ భరతం పడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్‌ఎస్‌దే హవా అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అబద్ధపు హామీలను ఎండగట్టేందుకే ‘బాకీ కార్డు’ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.
హైదరాబాద్‌లో ఉన్న సమస్యలతోనే ఆగమవుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతామని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. చెత్త, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలతో నగరం అల్లాడుతోందని, రోడ్ల నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మితమైతే, కాంగ్రెస్ ఒక్క ఇటుకా పేర్చలేదన్నారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజల ఆగ్రహం..
రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ అసమర్థ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని, రైతులు ఎరువుల కోసం వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత బంపర్ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి చేరికతో బీఆర్‌ఎస్ మరింత బలోపేతమవుతుందని అన్నారు. కేసీఆర్ 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించి, 10 ఏళ్ల పాలనలో దేశంలో అగ్రస్థానంలో నిలిపారని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే పండుగ బతుకమ్మ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, గౌరమ్మను భక్తితో కొలిచే సబ్బండ వర్ణాల సంబురం బతుకమ్మ పండుగ.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని తెలిపారు.