
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణలో అంతులేని అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. సర్కార్ కాదిది.. సర్కస్ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా..
‘స్థానిక సమస్యలు తీర్చడానికి
రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదని పత్రికలకెక్కుతాడు
పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే!
భారీవర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే
రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని
ఏకంగా ప్రపంచబ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వులపాలవుతాడు
ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే!
రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు
సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి
పరిశ్రమనే తగులబెడతానని బెదిరించి రౌడియిజం చేస్తాడు
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే!
అంతులేని అరాచకత్వమూ,
అపరిమితమైన అజ్ఞానమూ
రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో.
సర్కారు కాదిది సర్కసే!’ అంటూ పోస్టు చేశారు.