ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ లక్ష ఓట్ల తేడాతో ఘన విజయం.. ఇక టీఎంసీ.. | BJP Wins Repoll In Bengals Falta By Over 1 Lakh Votes | Sakshi
Sakshi News home page

ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ లక్ష ఓట్ల తేడాతో ఘన విజయం.. ఇక టీఎంసీ..

May 24 2026 7:42 PM | Updated on May 25 2026 3:09 PM

BJP Wins Repoll In Bengals Falta By Over 1 Lakh Votes

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఫల్తా స్థానానికి గురువారం (మే 21) రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు.

తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థి, తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్న జహంగీర్ ఖాన్‌ గత వారం రీపోలింగ్‌ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘పుష్ప’’ సంగతి తాను చూసుకుంటానని ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ముఖ‍్యమంత్రి సువేందు అధికారి కూడా అన్నారు. ‘‘పుష్ప’’ సినిమాలో అల్లు అర్జున్‌లా జహంగీర్ ఖాన్‌ తనను తాను పోల్చుకునేవారు. అందుకే ఆయనను ‘‘పుష్ప’’ అని అంటుంటారు.

ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సమయంలో ఓటింగ్ యంత్రాల్లో జోక్యం జరిగిందన్న ఆరోపణలు, ఎన్నికల అక్రమాల ఫిర్యాదుల తర్వాత ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు. గురువారం జరిగిన రీపోలింగ్‌లో మొత్తం 2.36 లక్షల ఓటర్లలో 87 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

రీపోలింగ్ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో భద్రతను రెట్టింపు చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిపేందుకు కేంద్ర బలగాల 25 కంపెనీలను మోహరించారు.

ఫల్తా నియోజక వర్గం తృణమూల్‌కు బలమైన కోటగా ఉండేది. లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం ఉన్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ స్థానం ఉంది. 2011 నుంచి ఈ స్థానంలో తృణమూల్ గెలుస్తోంది. అయినప్పటికీ తృణమూల్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కొన్ని రోజుల ముందే పోటీ నుంచి తప్పుకున్నారు.

ఈ ఎన్నికలో దేవాంగ్షు పాండా (బీజేపీ)తో పాటు అబ్దుర్ రజాక్ మోల్లా (కాంగ్రెస్), శంభు నాథ్ కుర్మీ (సీపీఎం), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పాండాకు 1,49,666 ఓట్లు, కుర్మీకి 40,645 ఓట్లు, మోల్లాకు 10,084 ఓట్లు, ఖాన్‌కు 7,783 ఓట్లు వచ్చాయి. ఖాన్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పటికే నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కూడా అయిపోవడంతో ఆయన పేరు, టీఎంసీ గుర్తు ఈవీఎంలపై ఉంది.

రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫల్తా ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినందుకు తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. “బీజేపీ బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం” అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement