
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మక లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులను నియమించింది.
రాయ్‌బరేలీ, అమేథీ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా భూపేశ్ బాఘెల్, అశోక్ గెహ్లాట్‌లను నియమించే ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచారానికి నాయకత్వం వహించారు. సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయ్‌బరేలీ, అమేథీలలో క్యాంపెయిన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందిని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్న వారితో ఇప్పటికే ఔట్ రీచ్ ప్రారంభమైందని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తారని సమాచారం.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్రనేతల ప్రచార ప్రణాళికలను, షెడ్యూల్‌ను కూడా ప్రియాంక గాంధీ చూసుకుంటారు. ఈమె ఎన్నికల ప్రచారంలో భాగంగా 200 నుంచి 300 గ్రామాలను కవర్ చేస్తూ.. రెండు నియోజక వర్గాలకు సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.
ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీలో వేసిన బలమైన పునాదుల కారణంగా అయన భార్య, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980లలో గెలుపొందారు. తరువాత గాంధీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అమేథీలో ప్రస్తుత బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ చేతిలో ఉంది. దీన్ని మళ్ళీ హస్తం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.
#LokSabhaElections2024 | Congress appoints Bhupesh Baghel as AICC Senior Observer to Raebareli and Ashok Gehlot to Amethi. pic.twitter.com/GSJ0EQvwBv
— ANI (@ANI) May 6, 2024