పోరు ఇక జోరు..! | Assembly election campaign Speed Up In All Political Parties | Sakshi
Sakshi News home page

పోరు ఇక జోరు..!

Nov 17 2023 12:39 AM | Updated on Nov 17 2023 12:39 AM

Assembly election campaign Speed Up In All Political Parties - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి పోటీలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత రావడం, ఎలక్షన్‌ జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగింపునకు రావడంతో.. జాతీయ పార్టీల కీలక నేతలు తెలంగాణపై ఫోకస్‌ చేశారు.

శుక్రవారం నుంచి కాంగ్రెస్, బీజేపీల అగ్రనేతలు వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌ గాందీ, ప్రియాంకా గాందీ, మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీఎంలు రానుండగా.. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ సీఎంలు రంగంలోకి దిగనున్నారు.

మరోవైపు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సుడిగాలి ప్రచా రానికి తెరతీశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ కూడా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్‌ఎస్, బీఎస్పీలు ఇప్పటికే మేనిఫెస్టోలను విడుదల చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించినా మరిన్ని హామీలతో శుక్రవారం మేనిఫెస్టో ప్రకటించనుంది. శనివారం బీజేపీ మేనిఫెస్టో విడుదలకానుంది. 

విస్తృతంగా సభలు, రోడ్‌షోలకు ప్లాన్‌ 
పోలింగ్‌కు ఇంకా రెండు వారాల వ్యవధి కూడా లేకపోవడంతో.. అన్ని పార్టీలు ప్రచార వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నేతలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ప్రచారం ముగింపునకు వచ్చే సమయానికి అగ్రనేతలతో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

దూకుడుగా ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్‌.. 
ఇప్పటికే రోజుకు మూడు, నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈనెల 25న పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభ ద్వారా బీఆర్‌ఎస్‌ సత్తా ఏమిటో చాటాలనే ఉద్దేశంతో గులాబీ అధినేత ఉన్నారు. ఇదే సమయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరూ విస్తృతంగా రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారు సాధించిన ప్రగతిని వివరిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీలను తుర్పారబడుతున్నారు. 

కాంగ్రెస్‌ అగ్రనేతలంతా ఇక్కడికే.. 
రాష్ట్రంలో తమకు సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సభలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తూ ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ప్రధానంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు లక్ష్యంగా ఘాటైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

శుక్రవారం (17న) గాందీభవన్‌లో మల్లికార్జునఖర్గే కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత కుత్బుల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. శుక్రవారమే.. అగ్రనేత రాహుల్‌గాంధీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రాజస్తాన్‌లో ఈ నెల 23తో ప్రచారం ముగుస్తుండటంతో.. వెంటనే కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా తెలంగాణలో ఉధృత ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఇక ఈ నెల 27న లేదా 28న సోనియాగాం«దీతో హైదరాబాద్‌ శివార్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

రంగంలోకి మోదీ, అమిత్‌షా.. 
బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ తదితరులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక దశ ప్రచారం పూర్తిచేసిన ఆ పార్టీ జాతీయ నేతలు.. శనివారం నుంచి మరోసారి రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం (18న) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజున గద్వాల, నల్లగొండ, వరంగల్‌ సభల్లో పాల్గొంటారు.

సికింద్రాబాద్‌లో ఎమ్మారీ్పఎస్‌ నేతలతో సమావేశం అవుతారు. 19వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలోని నారాయణపేట, చేవెళ్ల సభలతోపాటు మల్కాజిగిరి రోడ్‌షోలలో పాల్గొంటారు. ఈనెల 26–27 తేదీల మధ్య రెండు రోజులపాటు ప్రధాని మోదీ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 27న హైదరాబాద్‌ నగర రహదారులపై ఆయనతో భారీ రోడ్‌షో నిర్వహణకు బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయన మరో రెండు నగరాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కూడా పాల్గొననున్నారు. 
 
మాటల తూటాలు.. విమర్శల బాణాలు.. 
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మధ్య విమర్శలు, ఆరోపణలు అయితే తారస్థాయికి చేరాయి. బీజేపీ కూడా ఈ రెండు పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శనా్రస్తాలు సంధిస్తోంది. 

► కాంగ్రెస్‌ పాలన సమయంలో తెలంగాణ గోసపడ్డదని, మళ్లీ వారు వస్తే నాశనమే అంటూ బీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. కర్నాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్‌ విఫలమైందంటూ విమర్శనా్రస్తాలు సంధిస్తోంది. ఢిల్లీ బానిసలు కావాలా? ప్రజల్లో ఉండే బీఆర్‌ఎస్‌ కావాలా తేల్చుకోవాలంటోంది. బీఆర్‌ఎస్‌ సర్కారు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో రాష్ట్రం టాప్‌లోకి వెళ్లిందని.. వాటిని మరింత పకడ్బందీగా అమలు చేసేలా తమకే అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది. 

► తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినదే కాంగ్రెస్‌ పార్టీ అని.. ఎన్నో ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని, నిండా అప్పుల్లో ముంచేసిందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. కేసీఆర్‌ కుటుంబం వివిధ పథకాల్లో అవినీతికి, అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. బీఆర్‌ఎస్‌ చెప్పుకొంటున్న ప్రగతి డొల్ల అని, తాము వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామంటూ జనంలోకి వెళ్తోంది.  

► బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన, అవినీతి, హామీల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ పాలన, అవినీతిమయం అంటూ ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిచినా బీఆర్‌ఎస్‌లోకే వెళతారని, అందువల్ల బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తోంది. 

► బీఎస్పీ అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా అధికారపక్షంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ తమ అభ్యర్థుల పక్షాన దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement