సాక్షి, హిందూపురం: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై ఎల్లో తాలిబన్ల దాడి చేసిన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కదిరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు సతీష్ రెడ్డిని అడ్డుకుని.. హిందూపురం వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపికకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే, కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మక్బూల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నాయకులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ..‘హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దారుణంగా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?. పోలీసులు తమ విధులను సరిగా నిర్వర్తించడం లేదు. వేణు రెడ్డి ఏం తప్పు మాట్లాడారో చెప్పండి?. ఆందోళన చేపట్టే స్వేచ్చ కూడా ఏపీలో లేదా?. ఏపీలో ప్రజల గొంతుకను కూటమి పాలకులు నొక్కేస్తున్నారు. పోలీసు వ్యవస్థను కూటమి నేతలు దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కేసులు పెట్టినా అక్రమ కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అధికార పక్షానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా?’ అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. శనివారం హిందూపురంలో అధికార తెలుగు దేశం పార్టీ గూండాలు రెచ్చిపోయారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. టీడీపీ రౌడీలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. వాళ్లపైనా దాడి జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తోంది.


