రామోజీకి గుణపాఠం.. ఆరోజు త్వరలోనే! | Sakshi
Sakshi News home page

రామోజీకి గుణపాఠం.. ఆరోజు త్వరలోనే!

Published Sat, Feb 3 2024 2:55 PM

Kommineni Comment On Ramoji Rao Eenadu Vizag Propoganda - Sakshi

జర్నలిజంలో ఇంత దరిద్రంగా కూడా కథనాలు  ఇవ్వవచ్చని ఈనాడు మీడియా పదే, పదే రుజువు చేసుకుంటోంది. ఇప్పటివరకు మీడియా అంటే ఏవైనా సమస్యలు ఉంటే వార్తలుగా  రాయడం, దానికి పరిష్కార మార్గాలు చెప్పడం, సంబంధిత వర్గాల నుంచి రెండో వర్షన్ తీసుకోవడం, నిష్పక్షపాతంగా స్టోరీలు ఇవ్వడం అని అనుకుంటాం. కాని గత నాలుగేళ్లుగా ఈనాడు మీడియా ఏపీలో వైఎస్ ప్రభుత్వంపై రెచ్చిపోయి రాస్తున్న పిచ్చి రాతలు, పైత్యపు పోకడలు చూస్తే ఈనాడు యజమాని రామోజీరావుకు మానసికంగా ఏదో అయ్యిందని అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

కొద్ది రోజుల క్రితం ఏపీ ఎడిషన్‌లో విశోకపట్నం అంటూ ఒక దిక్కుమాలిన వార్తను బానర్‌గా ఇచ్చారు. కొత్తగా జర్నలిజంలోకి వచ్చినవారు  కూడా ఇంత చండాలంగా వార్తలు ఇవ్వరు. అబద్దాలు చెప్పడంతో దిట్ట అని పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా డిపాజట్లు రాకుండా రామోజీ బృందం అసత్యాలు రాసి ప్రజల మనసులను విషపూరితం చేయాలని చూసింది. సరిగ్గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ సిద్దం పేరుతో ఎన్నికల శంఖారావం పూరిస్తున్న రోజునే ఈ విషపూరిత కథనం ఇచ్చారంటే వారు ఎంత అనైతికంగా, విలువల వలువలు వదలివేసి విశాఖ నడివీధిలో ఏ స్థాయిలో  నగ్నంగా తిరిగింది అర్ధం చేసుకోవచ్చు.  ఆ కథనంలో విశాఖ శోకించిందట... అది రామోజీకి చెప్పిందట. నిజానికి రామోజీ, ఈనాడు బృందం ఏడుపులు వినలేక విశాఖ ప్రజలు ఛీదరించుకుంటున్నారు.

విశాఖ అభివృద్దికి కీలకంగా ఉపయోగపడే కార్యనిర్వాహక రాజధాని రాకుండా పిచ్చి రాతల ద్వారా, కోర్టుల ద్వారా అడ్డుపడుతున్న రామోజీరావు బృందం ఇప్పుడు విశాఖపట్నం మీద అభిమానం ఉన్నట్లు నటిస్తూ, నగరం మీద విషం కక్కుతున్నారు. నిజానికి ఈనాడు విశాఖపట్నానికి రుణపడి ఉండాలి. రామోజీ అభివృద్దిలోకి  రావడానికి ఇక్కడే పునాది పడింది. కాని ఆ నగరం వికాసానికి అదే రామోజీ ఎంత వీలైతే అంత  ఆటంకం కల్పిస్తున్నారు. ఈ స్టోరీలో ఎంత నీచంగా రాశారో చూడండి. దీనినే ఈటివిలో కూడా ప్రసారం చూసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి ఉంటారు. 'నా చుట్టూ ఉన్న పరిశ్రమలనుకుళ్ల బొడిచారు.." అని విశాఖ చెప్పిందట రామోజీరావుకు. పెట్టుబడిదారులను భయపెట్టారట. ఇంత ఘోరంగా అబద్దాలు రాసి రామోజీ పాపం మూటకట్టుకుంటున్నారు. ఐటి రంగాన్ని వదలుకున్నారట. ఇలా ఒకటేమిటి. ఒకటికాదు.. అనేక అబద్దాలు వండి ప్రజల మీద నూరిపోసే యత్నం చేసింది.

చంద్రబాబు టైమ్‌లో లూలు అనే మాల్ కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన తొమ్మిదెకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆ కంపెనీ మాల్ కట్టలేదు. దానిని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాల్ కోసం అంత విలువైన భూమి ఇస్తారా అన్న విమర్శలు ఉన్నాయి. పోనీ అదైనా నిర్మాణం చేశారా? అంటే అదీ లేదు. అయినా ఆ భూమిని అలాగే ఇచ్చేయాలని ఈనాడు రాస్తోంది. అక్కడ ఇంకే అభివృద్ది కార్యక్రమం చేపట్టరాదట. చంద్రబాబు టైమ్‌లో చాలా ఐటి సంస్థలు వచ్చాయట. ఇప్పుడు లేవట. ఇంతకన్నా అబద్దం ఉందా? కొంతకాలం క్రితం విశాఖలో ఇన్‌ఫోసిస్  కంపెనీని ఓపెన్ చేసింది ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి‌మోహన్‌రెడ్డి కాదా? అక్కడ ఐటి టవర్‌ను నిర్మించి ఐటి కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించడం లేదా? అదాని డేటా సెంటర్‌కు భూమి ఇస్తే, అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. మరో వైపు ఆ డేటా సెంటర్ పదిహేనువేల కోట్లే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందని ఈనాడే రాస్తుంది.

ఎలాగైనా విశాఖకు ఏ పరిశ్రమ రాకూడదన్నది ఈనాడు, రామోజీరావుల దురుద్దేశం. వస్తున్న కంపెనీలను అడ్డుకోవడం,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసి వారిని భయపెట్టడం.. ఇదే నిత్యకృత్యంగా పెట్టుకున్నారు. విశాఖ ఉక్కుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుడు వార్తలు రాసే ఈనాడు రామోజీరావు దమ్ముంటే కేంద్రంపైన, ప్రదాని నరేంద్ర మోదీపైన విమర్శలు చేస్తూ రాయవచ్చు కదా! అక్కడ మాత్రం వణికి పోతారు. అంతేకాదు... మోదీ ఇచ్చిన పద్మభూషణ్ బిరుదును చూసుకుని మురిసిపోయే రామోజీ కేంద్రంపై ఎందుకు రాస్తారు.. ఎంతసేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై పడి ఏడుస్తారు కాని. చంద్రబాబు టైమ్‌లో అంత స్వర్గం అయిపోయినట్లు, ఆ తర్వాత నరకం అన్నట్లు దిక్కుమాలిన వార్తలు రాసి ప్రజలపై విషం చిమ్ముతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక వెనుకుబాటు తనం మరింత పెరిగిందని ఉత్తరాంధ్రపై కపట ప్రేమను ప్రదర్శించింది.

చంద్రబాబు టైమ్‌లో నిజంగా అన్ని పరిశ్రమలు వచ్చి ఉంటే యువత ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండేది కాదు కదా! చంద్రబాబు టైమ్‌లో హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు లేదా అమెరికా వంటి దేశాలకు వలస వెళితే అదంతా చంద్రబాబు గొప్పతనమని, అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ టైమ్‌లో వెళితే ఉపాధి లేక వెళ్లారని రాసే చండాలపు రాతలకు ఈనాడు పాల్పడుతోంది. మూలపాడు పోర్టును నిర్మిస్తోంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాదా? పలాస వద్ద సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, రక్షిత నీటి పథకం తెచ్చింది ఈ ప్రభుత్వం కాదా? అయినా ముసలాయన అయిపోయిన రామోజీకి కనిపించకపోవచ్చు. మరి ఆయన దగ్గర పనిచేసేవారి కళ్లు కూడా పనిచేయడం లేదా? అచ్యుతాపురంలో ఈ మధ్య వచ్చిన పరిశ్రమలు, నక్కపల్లి వద్ద ఫార్మా హబ్‌ను సాధించడం అబద్దమా? రిషికొండమీద మంచి భవనం నిర్మించినా రామోజీకి కడుపు మంటగానే ఉంది. ఆయన మాత్రం కొండలను గుండు చేసి ఇల్లు కట్టుకోవచ్చు.

ప్రభుత్వం మాత్రం ఏ కట్టడాలు కట్టకూడదు. తెలుగుదేశం నేతలు కొండలు, గుట్టలు ఆక్రమించి నిర్మాణాలు చేయవచ్చు. ప్రభుత్వం మాత్రం చట్టబద్దంగా కూడా ఏ నిర్మాణం చేసినా ఈనాడు రోధిస్తోంది. ఒకపక్క ఏపీలో పేదరికం తగ్గుతున్నట్లు, ఉపాది అవకాశాలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతుంటే, ఈనాడు మీడియాకు మాత్రం కనిపించదు. ఎందుకంటే వారికి గుడ్డి ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి. విశాఖ నుంచి భీమిలి వరకు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పూనుకుంటే ఇదే పత్రిక ఏమి రాసింది? రోడ్డు విస్తరణలో పలువురు నిర్వాసితులు అవుతున్నారని, వారికి అన్యాయం జరుగుతోందని వ్యతిరేక కథనాలు ఇచ్చిందా? లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత అవుతుంది.

కళ్లున్న కబోదుల మాదిరి రామోజీ బృందం వ్యవహరిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పై ఈర్శ్య, అసూయ ద్వేషాలతో పిచ్చి రాతలకు ఈనాడు మీడియా పాల్పడుతోంది. అందుకే ఈనాడును, రామోజీరావును ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయినా వారు సిగ్గుపడడం లేదు. అదే దౌర్బాగ్యం. ఇలాంటి ఈనాడు జర్నలిజం ఏపీలో ఉన్నందుకు ప్రజలంతా  చీదరించుకుంటున్నా, తమ లక్ష్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ప్రజలకు దూరం చేయాలన్న దురుద్దేశం ముందు వారు ఏవీ పట్టించుకోవడం లేదు. ప్రజలే ఈనాడు మీడియాకు, రామోజీరావుకు గుణపాఠం చెప్పే రోజు రాకుండా ఉంటుందా?


-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement

తప్పక చదవండి

Advertisement