రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు
చేనేతకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే
చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
చేనేత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న చలో మంగళగిరి
సాక్షి, అమరావతి: చేనేత రంగానికి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయాలని చేనేత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఏడాదికి రూ.25 వేల చొప్పున నేతన్న భరోసా పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం అందించాలని, చేనేత కార్మికులకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరింది. చేనేత రంగానికి సంబంధించి 18 ప్రధాన డిమాండ్ల సాధన కోసం 15 చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
చేనేత రంగాన్ని ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని సమావేశానికి హాజరైన నాయకులు డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగానే నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జీఎస్టీని రద్దు చేయాలని, చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలు సబ్సిడీ ధరలకు అందించాలని, చేనేత రంగానికి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని, నేతన్నలకు 3 సెంట్ల చొప్పున భూమి ఇచ్చి ఇళ్లు నిర్మించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
ఫిబ్రవరి 23న చలో మంగళగిరి
రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 23న చలో మంగళగిరి నిర్వహించాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఏర్పాటు చేసింది. జేఏసీ కో–కన్వీనర్లుగా బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బుధవారపు బాలాజీ, కట్టా దుర్గారావు ఎంపికయ్యారు. సమావేశంలో చేనేత సంఘాల జాతీయ, రాష్ట్ర నేతలు నమాల శివరామప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ, దామెర్ల శ్రీకృష్ణ, ముప్పన వీర్రాజు, వీరభద్రేశ్వరరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, చింతా శ్రీనివాసులు, సాయి ఓంకారయ్య, సమతం రమణ మహేష్ మాట్లాడారు.


