2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం విమానాశ్రయ నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్
ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం
అన్ని అనుమతులు సాధించి 2023 మే 3న వైఎస్ జగన్ శంకుస్థాపన
నిర్దేశించిన లక్ష్యంలోగా 2026లో అందుబాటులోకి వస్తున్న ఎయిర్‌పోర్ట్
2019 ఎన్నికల ముందు అనుమతులు లేకుండా చంద్రబాబు శంకుస్థాపన
భూ సేకరణ కూడా చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు
2022లో కోర్టు కేసులు తొలగించి భూసేకరణ పూర్తి చేసిన జగన్ సర్కారు
అదే ఏడాదిలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం ఎన్‌వోసీ
శంషాబాద్‌కు వైఎస్సార్.. భోగాపురానికి ఆయన తనయుడు
వైఎస్ జగన్ శంకుస్థాపన చేయడంపై జీఎంఆర్ చైర్మన్ హర్షం
భోగాపురం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి బాబు ఆపసోపాలు
సాక్షి, అమరావతి : భూ సేకరణ పూర్తి చేయలేదు.. కనీసం కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రం నుంచి ఎన్‌వోసీ తీసుకోలేదు.. అయినా భోగాపురం ఎయిర్‌పోర్టును మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో 2014–2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేశారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన అశోక్ గజపతి రాజు ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు తీసుకురాలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. కనీసం ఎన్‌వోసీ కూడా లేదు.
అయినా ఎన్నికల ముందు హడావిడిగా భూ సేకరణ, ఎటువంటి అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమా అనిపించేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా వైజాగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం 2,200 ఎకరాల్లో నిర్మించేలా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం వంటి కీలక వ్యవహారాలను పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో ఉన్న కేసులను అధిగమించి పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు.
కేంద్రం కూడా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2022 నవంబర్‌లో నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసింది. దీంతో 2023 మే 3న వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాయు వేగంతో పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్టు తానే నిర్మిస్తున్నట్లు బాబు డబ్బా కొట్టుకోవడం ప్రారంభించారు. త్వరలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్న జీఎంఆర్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఆదివారం తొలిసారిగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో అప్పటి వైఎస్ జగన్ సర్కారు నిర్దేశించిన విధంగానే 2026 జూన్‌లోగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో క్రెడిట్ చోరీ ట్రెండింగ్
వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదానీ డేటా సెంటర్.. ఇలా అన్ని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకొని అభాసుపాలైనప్పటికీ వురోసారి నిస్సిగ్గుగా భోగాపురం ఎయిర్‌పోర్టును తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబు క్రెడిట్ చోరీపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో సహా పెట్టి ఉతికి ఆరేస్తున్నారు.

శంషా బాద్ ఎయిర్‌పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయంటూ జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు చెప్పిన మాటల వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క అనుమతిని కూడా తీసుకు రాలేదని, ఎకరం భూమి కూడా సేకరించలేదని, ఒక్క రూపాయి భూ పరిహారమూ చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. అయినా క్రెడిట్ తీసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.
క్రెడిట్ తండ్రీ తనయులదే..
మా ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌కు హైదరాబాద్‌లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో.. ఏమో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. – 2023 మే 3న భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు


