సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగింది. ఇప్పటివరకు హైదరాబాద్ నగర పాలక సంస్థల (జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా, తాజాగా ఖైరతాబాద్ ఉపఎన్నిక అంశం దీనికి తోడైంది. నగర రాజకీయాలకు వరుస ఎన్నికలు పరీక్షలుగా మారనున్నాయి. ఖైరతాబాద్‌తో మొదలై.. ఎమ్మెల్సీ మీదుగా మూడు కార్పొరేషన్ల ఎన్నికల దాకా వచ్చే సంవత్సరమంతా రాజకీయ వేడి..సెగలు రేపనుంది. ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ ఉపఎన్నిక జరుగనుండగా (ప్రస్తుత పరిస్థితిని బట్టి) 2027 మార్చిలోగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనుంది.
దీనికి సంబంధించిన ఓటర్ల జాబితా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై స్పష్టత కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఆలోగా ఆయా కార్పొరేషన్లలో తమ పట్టు పెంచుకునేందుకు, బలం ప్రదర్శించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
కీలకంగా కార్పొరేషన్ల ఎన్నికలు
క్యూర్‌లోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలు గ్రేటర్ రాజకీయాలకు కీలకంగా మారనున్నాయి. ఆ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, అవి భవిష్యత్‌లో అధికారం ఎవరిదో నిర్ణయించే ఎన్నికలుగా భావిస్తున్నారు. అన్ని పార్టీలు వాటిని సవాల్‌గా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటరునాడికి అనుగుణంగా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో నగర పాలక సంస్థలపై ప్రధాన రాజకీయ పక్షాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇప్పటికే పట్టణ సమస్యలపై విపక్షాలు ఆందోళనలు చేపడుతుండగా..అధికారపార్టీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, సంక్షేమ పథకాల ప్రారంభంతో దూకుడు కొనసాగిస్తోంది.
నాయకులకు విషమ పరీక్ష
ఖైరతాబాద్ ఉపఎన్నికతో ప్రారంభమయ్యే రాజకీయ హడావుడికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తోడు కానున్నాయి. ఆ తర్వాత మూడు కార్పొరేషన్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఒక ఎన్నిక ఫలితం పూర్తిగా విశ్లేషించకముందే.. మరో ఎన్నికకు అభ్యర్థుల వేట, వ్యూహాలు, ప్రచారం మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రతి రాజకీయ పార్టీకి కేడర్ బలం, నాయకత్వ సమన్వయం, ఓటర్లతో అనుసంధానం కీలకంగా మారనుంది. గ్రేటర్‌లో అసెంబ్లీ నుంచి మండలి వరకు.. అక్కడి నుంచి వార్డు స్థాయి వరకు జరుగనున్న ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఊపిరి సలపని పరిస్థితి కల్పించనున్నాయి.
2027.. ఒకదాని వెంట ఒకటి
ఒకదాని తర్వాత మరో ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున 2027 సంవత్సరం సిటీకి ఎన్నికల నామ సంవత్సరంగా మారనుంది. ఇప్పటి వరకు పరిపాలనా పరంగా పునర్వ్యవస్థీకరణ , కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, క్యూర్ చట్టం చుట్టూ కొనసాగిన చర్చల స్థానే ఎన్నికల రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి. ఆయా ఎన్నికల్లో బరిలో నిలిచేదెవరు? మూడు కార్పొరేషన్లలో ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంది? వంటి చర్చలు క్రమేపీ ఊపందుకోనున్నాయి. మొత్తానికి రాజకీయ పార్టీలకు, నేతలకు, కార్యకర్తలకు చేతినిండా పని ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


