ఖేడ్‌లో జోరుగా ప్రచారం
♦ దూసుకెళ్తున్న కారు మండలాలను
♦ చుట్టివస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు
♦ పోటాపోటీగా ప్రచారం
నారాయణఖేడ్: ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఖేడ్ నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారం ఊపందుకుంది. దీంతో పార్టీల నేతలు గ్రామాలను చుట్టివస్తున్నారు. ఉదయం నుంచి రాత్రివరకు ప్రచార హోరు సాగుతోంది. గ్రామాల్లో ఎన్నికల వేడి రగిలింది. క్షేత్రస్థాయి సభలు, సమావేశాలు, పర్యటనల హోరు కొనసాగుతోంది. పార్టీలు పోటాపోటీ ప్రచారానికి దిగాయి. ముఖ్యంగా ప్రచారంలో కారు జోరుమీదుంది. ఆ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయి ప్రచారం కొనసాగిస్తున్నారు.
నిత్యం పది, పన్నెండు గ్రామాల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి మొదలయ్యే ప్రచారం రాత్రి వరకు కొనసాగుతోంది. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాలను ఇప్పటికే మంత్రి చుట్టివచ్చారు. ఈనెల 10వ తేదీవరకు మంత్రి పర్యటన షెడ్యూల్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది. ముఖ్యంగా ఖేడ్ వెనుకబాటుతనం, విద్య, వైద్యం, ఉద్యోగావకాశాలు, ఉపాధి, తాగు, సాగు నీటి అవసరాలను వివరిస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు.
గత పాలకుల వివక్ష, అణచివేత, పోలీసు కేసులను మంత్రి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. దీంతోపాటు తాము చేపట్టబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. తాను మాటలు చెప్పడంకాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, మాటకోసం ప్రాణమైనా ఇస్తానంటూ సభల్లో మంత్రి పేర్కొంటుండడంతో ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జనం తాగునీటికోసం అల్లాడుతున్నారు.
నీటివనరుల వట్టిపోవడం, విద్య, ఉపాధి, వైద్యం తదితర రంగాల్లో వెనుకబాటును మంత్రి ప్రస్థావిస్తూ ఉండడంతో ప్రజలనుంచి స్పందన వస్తోంది. మంత్రితోపాటు ఎంపీ బీబీ పాటిల్, దుబ్బాక, సంగారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతాప్రభాకర్, హన్మంతు షిండే తదితరులు టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, అభ్యర్థి సంజీవరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరఫున రాష్ర్ట రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, అభ్యర్థి విజయపాల్‌రెడ్డి ప్రచారం చేన్నారు. ప్రధానంగా ఇక్కడ పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది.