సాయం చేయండి..
● లారీ ప్రమాదంతో చిన్నారి కుటుంబం ఛిన్నాభిన్నం ● సాయం కోసం బాధితుల ఎదురుచూపు
జ్యోతినగర్: నిన్నటి వరకు కొడుకును ఎత్తుకుని మురిసిన ఆ తల్లి.. ఇప్పుడు ఆస్పత్రిలో మంచానికే పరిమితమైంది. కుమారుడి పరిస్థితీ విషమంగా మారింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది. పినకాశి సతీశ్(33), భార్య స్వప్న (26), కుమారుడు విక్కీ (6)తో కలిసి ఇటీవల బైక్‌పై వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో స్వప్న కుడికాలు తీవ్రంగా దెబ్బతినగా వైద్యులు తొలగించారు. పక్కటెముకలు విరిగాయి. ఊపిరితిత్తులకూ గాయాలయ్యాయి.
చిన్నారి పరిస్థితి విషమం
ప్రమాదంలో విక్కీ కుడికాలు, కుడిచేయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంతో ఆ చిన్నారి జీవితం తలకిందులైంది. తల్లి ఒకవైపు.. కొడుకు మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో కుటుంబ సభ్యుల ఆవేదన అంతాఇంతాకాదు.
రూ.15 లక్షల వరకు ఖర్చు
తీవ్రంగా గాయపడ్డ తల్లీకొడుకులను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే సతీశ్‌కు ఇంత భారీమొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టంగా మారింది. భార్య, కొడుకు ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతోపాటు వైద్య ఖర్చుల భారం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఆపదలో అండగా..
ఎన్టీపీసీకి చెందిన శ్రీభగవతీ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి వెళ్లి రూ.30వేల విలువైన చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు పైడ సాయి, జూల విజయ్, భూక్యా రవి నాయక్, కాంతాల రామ్‌చంద్రారెడ్డి, సురారపు బాలకృష్ణ పాల్గొన్నారు.
22జీడికె76 చెక్కు అందిస్తున్న శ్రీభగవతీ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు
ఆస్పత్రి ఖర్చులు భారంగా మారడంతో సతీశ్ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. వివరాల కోసం 95026 91082 ఫోన్ నెంబర్‌కు సంప్రదించవచ్చు.


