● ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ● పిల్లల మానసిక ప్రవర్తననూ తెలుసుకోవచ్చు
రామగుండం: పాఠశాల విద్యార్థుల్లోని వైకల్యాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. దీనిని ప్రీ అసెస్‌మెంట్ హాలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ (ప్రశస్త్–పీఏహెచ్‌ఎస్‌టీ)గా వ్యవహరిస్తారు.
● యాప్ ముఖ్య ఉద్దేశం: తరగతి గదుల్లో పిల్లల ప్రవర్తన, శారీరక మానసిక లక్షణాలను గమనించి, లోపాలను వైద్య పరీక్షలకు ముందే పసిగట్టడం. ఇందులో 21 రకాల వైకల్యాలను గుర్తించే వీలుంటుంది. ప్రీ–ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ దీని పరిధిలోకి తీసుకొస్తారు.
● పనితీరు: దీనిని రెండు దశలుగా వినియోగిస్తారు. పార్ట్–1లో రెగ్యులర్ ఉపాధ్యాయులు ప్రతీవిద్యార్థి రోజువారీ ప్రవర్తన, చదవడం, రాయడం, వినికిడి, చూపు, శారీరక కదలికలను పసిగడతారు. యాప్‌లోని ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు ఆవును/కాదంటూ సమాధానాలను సమర్పిస్తారు. పార్ట్–2లోతొలిదశలో గుర్తించిన విద్యార్థుల వివరాలను స్పెషల్ ఎడ్యుకేటర్లు పరిశీలిస్తారు. విద్యార్థి వైకల్యం తాత్కాలికంగా నిర్ధారించి నివేదిక ఇస్తారు.
● ఉపయోగించే విధానం: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేయవచ్చు. పాఠశాల యూడైస్+కోడ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్(ఓటీపీ ద్వారా) ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇందులో ప్రిన్సిపాల్/హెచ్‌ఎం/రెగ్యులర్ టీచర్/స్పెషల్ ఎడ్యుకేటర్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. యాప్ లోపల ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణ వీడియోలను పూర్తిగా వీక్షించి, అసెస్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
● ప్రయోజనాలు : సాధారణంగా బయటకు కనిపించని లెర్నింగ్ డిజెబిలీటీ (చదవడంలో లోపాలు), ఆటిజం, మానసిక ఒత్తిడి తదితర రుగ్మతలను ఆరంభంలోనే గుర్తించవచ్చు. యాప్ ద్వా రా జనరేట్ అయిన డేటా ఆధారంగా ప్రభుత్వం సదరు విద్యార్థులకు సదరమ్ క్యాంపుల ద్వారా త్వరగా ఉచిత వైద్య ధృవీకరణపత్రాలు, ఉపకరణాలు అందించే వీలుంటుంది. యాప్‌తో ప్రాథమిక దశలో లోపాలను సులభంగా అంచనా వేసే స్క్రీనింగ్ మాత్రమే. ఆ తర్వాత తుది వైద్య నిర్ధారణ అర్హులైన డాక్టర్లు ధ్రువీకరిస్తారు.


