లబ్ధికోసమే బీఆర్‌ఎస్‌ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు | - | Sakshi
Sakshi News home page

లబ్ధికోసమే బీఆర్‌ఎస్‌ నీటి రాజకీయం : దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Apr 2 2024 12:40 AM | Updated on Apr 2 2024 3:07 PM

- - Sakshi

కాంగ్రెస్‌ పాలనలోనే రైతులకు మేలు

పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తాం

సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం

ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తాం

రాష్ట్ర ఐటీశాఖ మంత్రిదుద్దిళ్ల శ్రీధర్‌బాబు

పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డ బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ మరోసారి తెలంగాణ ప్రజలు, రైతులను మోసగించి పార్లమెంట్‌ ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకే ‘నీళ్ల’ రాజకీయం చేస్తున్నారని రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌తో కలిసి మాట్లాడారు.

అధికారంలో ఉన్న పదేళ్లలో రైతులను ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఇప్పుడు వారి కష్టాలు గుర్తుకొచ్చాయని మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అయినా రైతులు ఆయనను నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్‌ అఽధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన మోసాలు, పాపాలు బయటకు వస్తున్నాయని, వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తాం..
వ్యవసాయ రంగంలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మిస్తామని, అలాగే పాలకుర్తి మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కాగా అమలు చేస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 35కోట్ల మంది అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించారని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ అర్హులందరికీ అందిస్తామని తెలిపారు.

సాంకేతిక కారణాలతో పొరపాట్లు దొర్లినా ఇబ్బంది పడొద్దని, వారి నుంచి విద్యుత్‌ అధికారులు బిల్లులు వసూలు చేయరాదని సూచించారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15కోట్ల విలువైన వైద్యసేవలు అందించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన బీఆర్‌ఎస్‌ పాలకుల తప్పిదాలను గాడిన పెట్టేందుకే సమయం పడుతోందని తెలిపారు. సమావేశంలో నాయకులు శంకర్‌, రమేశ్‌గౌడ్‌, సారయ్య, ప్రకాశ్‌రావు, మహేందర్‌, సంపత్‌, మల్లయ్య, శ్రీనివాస్‌, మస్రత్‌, కుమార్‌, ఈర్ల స్వరూప, కుమారస్వామి, అక్బర్‌అలీ పాల్గొన్నారు.

ఇవి చదవండి: దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement