దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి

Komati Reddy Venkat Reddy Comments Over Danam Nagender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్‌కు కిషన్‌ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్‌ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్‌ ఉంటుంది. బూత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్‌లో కూడా దానం నాగేందర్‌ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. 

బీఆర్‌ఎస్‌ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్‌ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ వేసి హైదరాబాద్‌ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్‌ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్‌ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్‌ చేశారు. 

ఇక, దానం నాగేందర్‌ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి కోమటిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top