● ప్రతి గ్రామానికి ప్రత్యేక వాట్సాప్ గ్రూపు
● సంయుక్త సంచాలకులు సీహెచ్‌వీఎస్‌ఏ కుమార్
పార్వతీపురం రూరల్: ప్రభుత్వం చేపట్టిన భూ రీ–సర్వే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కాకినాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(మల్టీజోన్‌న్–1) సీహెచ్‌వీఎస్‌ఎస్‌ఏ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. కొమరాడ మండలం బిన్నీడి గ్రామంలో జరుగుతున్న రీ–సర్వేను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సర్వే, భూరికార్డుల కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వే అధికారులతో సమీక్షించారు. నాలుగో విడతలో 83, ఐదో విడతలో 100 గ్రామాల రీ–సర్వే పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రీ–సర్వే గ్రామానికి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, రైతులందరినీ సభ్యులుగా చేర్చాలని సూచించారు. గ్రౌండ్ ట్రూతింగ్ (జీటీ), సెక్షన్–9 నోటీసులు ఇచ్చేటప్పుడు, డ్రాఫ్ట్, ఫైనల్ పీపీబీ దశల్లో రైతులతో తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించాలని స్పష్టం చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్ చేపట్టే ముందే రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని, అందుబాటులో లేకుంటే వాట్సాప్ ద్వారా పంపి వారి అంగీకారాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ఐదో విడత జీటీ పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, జీటీ పూర్తయిన రోజే వెక్టరైజేషన్ ప్రక్రియను ముగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


