సాలూరు: సాలూరు మండలం పట్టుచెన్నేరు పంచాయతీలోని శిఖపరువు గ్రామానికి జ్వరమొచ్చింది. ప్రతీ ఇంటిలో ఒకరు జ్వరంతో మంచం పట్టారు. వైద్యసేవల కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు దారిఖర్చులు లేక ఇంటివద్దనే కొందరు మూలుగుతున్నారు. మరికొందరు ప్రైవేటు వాహనాల్లో తోణాం పీహెచ్‌సీ, సాలూరులోని ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయించగా, కొందరు ఆర్‌ఎంపీల వద్ద వైద్యసేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వెంటనే స్పందించారు. వైద్యాధికారులతో మాట్లాడారు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి సేవలు అందించాలని ఆదేశించారు.
జ్వర కేసులు నమోదు..
గ్రామంలో నిర్వహించిన వైద్యశిబిరంలో 53 మందికి వైద్యాధికారులు, సిబ్బంది వైద్యపరీక్షలు చేశారు. మలేరియా అనుమానిత కేసులు 6 బయటపడ్డాయి. జ్వరంతో బాధపడుతున్న మరో 8 మందికి, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురికి వైద్యసేవలు అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరు విద్యార్థులను తోణాం పీహెచ్‌సీకి తరలించారు.
ఆస్పత్రికి వెళ్లేందుకు దారిఖర్చులు లేక... నడిచివెళ్లేందుకు ఓపిక లేక..
ఇంటి వద్దే జ్వరంతో మూలుగుతున్న గిరిజనులు
సమాచారం తెలిసి వైద్యబృందాన్ని పంపించిన కలెక్టర్


