నాగావళిలో... ఇసుక లూటీ..! | - | Sakshi
Sakshi News home page

నాగావళిలో... ఇసుక లూటీ..!

Jul 17 2026 3:28 AM | Updated on Jul 17 2026 3:28 AM

ఓనె అగ్రహారం వద్ద నాగావళి నదీగర్భంలో

ఇసుక తవ్వకాలు ఇలా..

వంగర: ఇసుకాసురులు బరి తెగించారు. కొందరు అధికారులు, నాయకుల అండదండలతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాగావళి నదిలో ఇసుకను లూటీ చేస్తున్నారు. రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. వంగర మండలం ఓనె అగ్రహారం సమీపంలో డీ సిల్టింగ్‌ పేరుతో నాగావళి నదిలో సాగుతున్న ఇసుక దందా తీరగ్రామాల ప్రజలను కలవరపెడుతోంది.

అనుమతి ఇలా....

ఓనె అగ్రహారం సమీపం నాగావళి నదిలో డీ సిల్టింగ్‌ పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌ 10న జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి ఇసుక తవ్వకాలకు ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి చెందిన జీవీఆర్‌ ఇన్‌ఫ్రాస్‌ ఇసుక తవ్వకాలకు అనుమతి పొందింది. ఒక మీటరు లోతు ఇసుక డీసిల్టింగ్‌ చేసి ఒక లక్షా ఐదు వందల మెట్రిక్‌ టన్నులు ఇసుక తీసుకువెళ్లాలని అధికారులు నిర్దేశించారు. మేట వేసిన ఇసుకను తరలించి నీటిప్రవాహానికి అడ్డులేకుండా చేయాలని సూచించారు.

నిబంధనలకు తూట్లు.....

అనుమతులు పేరుతో కాంట్రాక్ట్‌ ఏజెన్సీతో పాటు స్థానిక వ్యాపారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కొందరు అధికారులు, స్థానిక నాయకుల అండదండలతో ఇసుక దందా సాగిస్తున్నారు. భారీ యంత్రాలతో నదిలో ఇసుకను తవ్వి అక్రమంగా తరలింపుతో పాటు డంప్‌ చేస్తున్నారు. నదిలో పెద్దపెద్ద గోతులు కావడంతో తీరగ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలాల ముంపుతో పాటు, గోతుల్లో దిగిన పశువులు, మనుషులకు ప్రాణహాని ముప్పు ఉందంటూ ఓనె అగ్రహారం, మగ్గూరు, సంగాం గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఎంత ఇసుక తరలిస్తున్నారన్నది లెక్కలేకపోవడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ సైతం శూన్యంగానే కనిపిస్తోంది. కొందరు అధికారులకు ఇసుక తవ్వకాల సంస్థ పెద్దమొత్తంలో ముడుపులు అందిస్తున్నట్టు సమాచారం.

అక్రమంగా డంప్‌

ఇసుక డంప్‌ చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ మడ్డువలస ప్రాజెక్టును ఆనుకొని అక్రమంగా ఇసుక డంప్‌ చేస్తున్నారు. మరోవైపు ఇసుక నిల్వచేసే ప్రదేశానికి పది అడుగుల దూరంలో వంగర, రేగిడి మండలాల్లోని 24 పంచాయతీలకు తాగునీరు అందించే రక్షిత మంచినీటి పథకం ఉంది. పథకం పైపులైన్ల మీదుగా భారీ లారీలు ఇసుకతో వెళ్లి వస్తున్నాయి. దీంతో ఇక్కడ ఉన్న భారీ పైపు లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తాగునీటి సరఫరా విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు.

వీఆర్వో చూసుకుంటారు

ప్రభుత్వం ఇసుక ఏజెన్సీకి అనుమతులు ఇచ్చింది. వారు తవ్వుకుంటారు. ఇందులో చెప్పడానికి ఏముంది. ఇసుక తరలింపు లెక్కలు మా వీఆర్వో చూసుకుంటాడు.

– పిన్నింటి రామారావు, తహసీల్దార్‌, వంగర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement