పార్వతీపురం రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి.విజయలక్ష్మి గురువారం కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు దిశానిర్దేశం చేశారు.
జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
సాలూరు: మండలంలోని పగులుచెన్నేరు పంచా యతీ పరిధి ఎగువమెండంగి గ్రామానికి చెందిన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై మృతిచెందాడు. మృతుని తండ్రి దనేల్ తెలిసిన వివరాల ప్రకారం బడ్నాయికవలస పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివిన విద్యార్థి 503 మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ గురువారం కాళ్లు, చేతులు కదలపలేని స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధపడేలోపే జయంత్ మృతిచెందాడు. అందివచ్చిన కుమారుడు జ్వరంతో మృతిచెందడంతో తల్లిదండ్రులు దనేల్, పోలమ్మలు కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తులు పలువురు జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలిసింది. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఆస్పత్రికి సకాలంలో తీసుకెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. వ్యాధుల బారిన పడి చివరకు తనువు చాలిస్తున్నారు.
ఉల్లి ధరల ఘాటు
పార్వతీపురం: జిల్లాలో నెలరోజుల కిందటి వరకు కిలో రూ.20లకు లభించిన ఉల్లిపాయల ధరలు గత 15 రోజులుగా రెట్టింపు అయ్యా యి. బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయలు కిలో రూ. 40 నుంచి రూ.42 వరకు నాణ్యత రకాలను బట్టి విక్రయిస్తుండగా, హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.35కు విక్రయిస్తున్నారు. వర్షాభావంతో ఉల్లి ఉత్పత్తి తగ్గడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉల్లిపాయల రవాణా వ్యయాలు పెరగడం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
కురుపాం మేజర్ పంచాయతీకి ఐఎస్‌ఓ గుర్తింపు
కురుపాం: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, సమర్థవంతమైన దస్త్రాల నిర్వహణ, పారిశుద్ధ్యం, పారదర్శక పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ జాబితాలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కురుపాం మేజర్ పంచాయతీ ఒక్కటే ఎంపిక కావడం గమనార్హం. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా కురుపాం మేజర్ పంచాయతీ ఈఓ ఎ.వెంకటనాయుడు ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కురుపాం ఎంపీడిఓ జె.ఉమామహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీఓ జి.రమేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో ఒక్క కురుపాం మేజర్ పంచాయతీకే ఐఎస్‌ఓ ధ్రువీకరణ లభించడం మండలానికి గర్వకారణమన్నారు. ఈఓ వెంకటనాయుడు, సచివాలయం–1, 2 సిబ్బందిని అభినందించారు.


