ప్రతీ నెల పౌరహక్కుల దినం నిర్వహించాలి
● అట్రాసిటీ ఘటనల ప్రాంతాలకు
ఆర్‌డీవో, డీఎస్పీలు హాజరు కావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: ప్రతి నెల 30వ తేదీని పౌర హక్కుల దినాన్ని పక్కాగా నిర్వహించి డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యులందరినీ తప్పనిసరిగా ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం తదితర వివరాలను నెల రోజుల ముందే షెడ్యూల్ చేయాలని, అనంతరం మినిట్స్‌ను కలెక్టర్‌కు పంపించాలని, వాటిపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక మరియు పునరావాస చట్టంపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30న అన్ని మండలాల్లో ఎస్‌హెచ్‌వో, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్‌డే నిర్వహించి సమావేశపు వివరాలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో డీవీఎంసీ సభ్యులు బసవ సూర్యనారాయణ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల శ్మశానాలు లేకపోవడం మరికొన్ని చోట్ల ఆక్రమణలు జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామ జనాభాను బట్టి శ్మశాన విస్తీర్ణం ఉండాలని ముగ్గురు ఆర్డీవోలు తనిఖీలు చేసి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ఆక్రమణలు జరిగాయో నివేదిక పంపాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో శ్మశానాలు, వాటికి రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని సభ్యుడు చిట్టిబాబు ప్రస్తావించగా నిధుల కోసం డీవోకు లేఖ రాసినట్టు, నిధులు రాగానే పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలపై దాడులు జరిగినప్పుడు ఆర్‌డీవో, డీఎస్పీలు, తప్పనిసరిగా సంఘటనా స్థలానికి హాజరై విచారణ జరపాలని, హత్య కేసులైతే కలెక్టర్, ఎస్పీలు కూడా హాజరు కావాలని సభ్యులు మజ్జి గణపతి, ఎం.రాము కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి ఆర్‌డీవోలు, డీఎస్పీలు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 17 నమోదయ్యాయని, అందులో 14 కేసులు విచారణలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి డిసెంబర్ 15 వరకు 49 కేసుల్లో 68 మందికిగాను రూ.58 వేల పరిహారం చెల్లించినట్టు తెలిపారు. జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం మున్సిపాలిటీలో రెండు చోట్ల మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారన్న సమాచారంపై మున్సిపల్ కమిషనర్ వెరిఫై చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. జేసీ సేతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్‌వో మురళి, డీఎస్పీలు, ఆర్‌డీవోలు, సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణమ్మ, జిల్లా అధికారులు, డీవీఎంసీ సభ్యులు సున్నపు రామస్వామి, ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.


