తల్లి వెంటే తనయ...
● మృత్యువులోనూ వీడని తల్లీకూతుళ్ల అనుబంధం
● తల్లిని కడసారి చూసేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..
● విలపిస్తున్న కుటుంబ సభ్యులు
● చింతపల్లిపేటలో విషాదం
గుర్ల: తల్లి అంటే ఆమెకు ప్రాణం. తల్లి మర ణంతో తల్లఢిల్లింది. ఆమె భౌతిక కాయాన్ని పట్టుకుని బోరున ఏడ్చింది. ఆ క్రమంలో కుప్పకూలి ఆస్పత్రిపాలైంది. అక్కడే ప్రాణం విడిచిన ఘటన గుర్ల మండలం చింతపల్లిపేటలో చోటుచేసుకుంది. తల్లిని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... చింతపల్లిపేటకు చెందిన సోమురోతు అప్పలనర్సమ్మ (60) అనారోగ్యంతో సోమవా రం మృతి చెందింది. తల్లిని చివరిగా చూసేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన కుమార్తె గౌరి (39) తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లికి ఓ వైపు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేస్తూనే మరోవైపు గౌరిని చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం అర్థరాత్రి సమయంలో మృతి చెందింది. 24 గంటల వ్యవధిలో తల్లీకుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గౌరి భర్త శంకరరావు విశాఖపట్నం పోర్టులో కూలిపని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. వారికి కుమారుడు హర్షవర్థన్, కుమార్తె కుసుమ ఉన్నారు.
పర్యాటక ప్రదేశాలను
అభివృద్ధి చేయండి
పార్వతీపురం: పర్యాటకులను ఆకర్షించేలా పిక్నిక్ స్పాట్‌లను అభివృద్ధిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది జిల్లాలో 2లక్షల మంది పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను సందర్శించారన్నారు. మండలాల పరిధిలోని దేవాలయాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ పాయింట్స్ వంటి ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.52 కోట్లు లక్ష్యం కాగా ఇంత వరకు రూ.32కోట్లు ప్రగతిని సాధించిందన్నారు. గృహ నిర్మాణశాఖలో పీఎం జన్‌మాన్, పీఎంఏవై కింద 9,438 ఇళ్లకు 8వేలు ఇల్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఇంటి నిర్మాణాల కోసం 31,325 మందిని అర్హులుగా గుర్తించామని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరని, హాజరు వేయనివారికి జీతాలు నిలిపివేయాలని హెచ్‌ఓడీలను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత పాల్గొన్నారు.


