అదనంగా ఇస్తేనే.. ధాన్యం బస్తాలు దించేది..!
● 80 కిలోలకు అదనంగా మరో 4 కిలోల ధాన్యం వసూళ్లు
● అర్థరాత్రి వరకూ ఇబ్బందులు పడ్డ రైతులు
రాజాం : పట్టణంలోని పాలకొండ రోడ్డులో లక్ష్మీనారాయణ రైస్ మిల్లు వద్ద సోమవారం అర్థరాత్రి వరకూ కొంతమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. సంతకవిటి, రేగిడి మండలాలకు చెందిన రైతులతో పాటు రాజాం మండల రైతులు కొందరు ఇక్కడకు సోమవారం ధాన్యం విక్రయాలు నిమిత్తం తీసుకొచ్చారు. ముందస్తుగా తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం శాంపిల్స్ తీయడంతో పాటు వాటిని ఈ మిల్లర వద్దకు తీసుకొచ్చి అనుమతులు ఇచ్చిన తరువాత ట్రక్‌షీట్లు తీసుకున్నారు. ఆయా ట్రక్‌షీట్లుతో ట్రాక్టర్ల ద్వారా ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకుని రాగా మిల్లరు ధాన్యంలో నాణ్యత లేదని, కళాసీలు లేరని మొండికేసి ధాన్యం అన్‌లోడింగ్ చేయకుండా ట్రాక్టర్లపైనే వదిలేశారు. ఓ వైపు గజగజలాడించే చలి, మరో వైపు ట్రాక్టర్ల యాజమాన్యంతో ఇబ్బందులు పడుతూ రైతులు నానా అవస్థలు పడ్డారు.
అదనపు చెల్లింపుతో దిగిన యజమాని
చివరకు రైతులు ఒక్కో 80 కిలోల బస్తా ధాన్యంకు అదనంగా నాలుగు నుంచి ఐదు కిలోలు చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ధాన్యం దించేందుకు మిల్లరు అనుమతులు ఇచ్చాడు. పలువురు రైతులు ఈ ఒప్పందానికి అంగీకరించి ధాన్యం బస్తాలు దించారు. వీరికి రాత్రి 12 గంటల సమయం పట్టింది.
మరికొంతమంది రైతులు అదనంగా ధాన్యం ఇచ్చేందుకు నిరాకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. తాము మధ్యాహ్నం 2 గంటలకు ధాన్యం తీసుకెళ్తే రాత్రి 11 గంటల వరకూ ధాన్యం దించకుండా లక్ష్మీనారాయణ మిల్లర్ల యజమాని అడ్డుకున్నారని సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయంపై మిల్లరు యజమాని అవినాష్ వద్ద సాక్షి ప్రస్తావించగా, ధాన్యం నాణ్యత బాగోలేని కారణంగా రైతులే అదనంగా ధాన్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
అదనంగా ఇస్తేనే.. ధాన్యం బస్తాలు దించేది..!


