వివాహిత ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : నగరంలోని అయ్యకోనేరులో ఓ వివాహిత మృతదేహాన్ని టు టౌన్ పోలీసులు మంగళవారం కనుగొన్నారు. ఎస్‌ఐ కనకరాజు తెలిపిన వివరాలు... దాసన్నపేటలోని గొల్లవీధికి చెందిన కోరాడ సునీత(35)కు పదేళ్ల కిందట వివాహమైంది. పెళ్లయి పదేళ్లు అవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో, భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సునీత మానసిక స్థితిని కోల్పోయింది. ఈ పరిస్థితిలో సునీత బాగోగులను అన్నయ్య చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో సునీత కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతికాడు. స్థానికులను సంప్రదించాడు. ఇంతలో స్థానిక అయ్యకోనేరులో ఓ మహిళ మృతదేహం కనిపించిందని సునీత అన్నయ్యకు సమాచారం అందింది. అయ్యకోనేరుకు వెళ్లి చూడగా పడమర గట్టున సునీత మృతదేహం కనిపించింది. పోలీసులు సీసీ పుటేజీలో చూడగా సోమవారం రాత్రే ఇంటి నుంచి వెళ్లి కోనేరులో దూకేసినట్టు రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. సునీత అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


