బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
● ఆగని ఇసుక దందా
● మొద్దునిద్రలో అధికార యంత్రాంగం!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు వెళ్తున్నా.. అది మూడు రోజుల ముచ్చటగానే మారుతోంది. వెళ్లడం.. వాహనాలను పట్టుకోవడం.. తర్వాత విడిచిపెట్టేయడం షరామాములుగా మారింది. మరలా కొద్దిరోజులకే ఇసుకాసురులు బరి తెగించేస్తున్నారు. కొమరాడ, పాలకొండ, భామిని తదితర నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాలను అక్రమార్కులు గుల్ల చేస్తున్నారు. సీతానగరం, పాచిపెంట మండలాల్లోనూ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొమరాడ మండలంలోని కూనే రు రామభద్రపురం, కొరిశీల రెవెన్యూ పరిధిలో కొన్నాళ్లుగా తవ్వకాలు సాగుతున్నాయి. వాహనాల రాకపోకలకు దర్జాగా మెటల్ రోడ్డు వేసేసినా.. అధికార యంత్రాంగం కళ్లు మూసుకుందా? అన్న ప్రశ్నలు తీరప్రాంత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే సాగుతోందన్న ఆరోపణలున్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలోని గోపాలపురం, అంపిలి తదితర ప్రాంతాల్లో ఇసుక దందా సాగుతోందని స్వయంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భామిని పరిసరాల్లోనూ నది గుల్ల అయిపోతోంది. నదిలో యంత్రాల సాయంతో ఇసుకను గుట్టలుగా పోగు చేసి.. అక్కడ నుంచి లారీలతో తరలిస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో భారీ వాహనాల ద్వారా విశాఖ తదితర ప్రాంతాలకు తరలిపోతోంది.
చూసీచూడనట్లు వదిలేస్తున్న యంత్రాంగం
అధికార పార్టీ అండదండలు ఉండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలకొండ డివిజన్ పరిధిలో ఇటీవల సబ్ కలెక్టర్ అర్ధరాత్రి పూట ఆకస్మిక తనిఖీలు చేసి కొన్ని వాహనాలను పట్టుకున్న విషయం విదితమే. పగటివేళ పోలీస్, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి తెలియకుండా తవ్వకాలు సాగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల తమ పరిధిలోకి రాదని ఇటు రెవెన్యూ, అటు గనుల శాఖాధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ, తప్పించుకుంటున్నారు.
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


