ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని వెంపలగూడ సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో పెద్దింటి సోమేశ్వరరావు (53) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆర్.యుగంధర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉంది. టి.జయరాజు, అరవింద్‌లకు స్వల్ప గాయలవ్వడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ వై.అమ్మన్నరావు తెలిపిన వివరాలు.. పీపీ ఈతమానుగూడ పంచాయతీ ఇప్పగూడకు చెందిన సోమేశ్వరరావు తన స్వగ్రామం నుంచి సీతంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఎదురుగా కొత్తూరుకు చెందిన యుగంధర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురెదురు వాహనాలు బలంగా ఢీకొట్టాయి. దీంతో సోమేశ్వరరావు తలపై బలమైన గాయం తగలడంతో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన యుగంధర్‌కు ప్రధమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్టు, స్వల్ప గాయాలైన ఇద్దరు ఇక్కడే ట్రీట్‌మెంట్ పొందుతున్నట్టు సూపరెండెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మృతుని భార్య బుచ్చమ్మ రెండేళ్ల క్రితం మృతి చెందగా ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడానికి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
మరొకరి పరిస్థితి విషమం


