
బీసీ మహిళా నేతకు అవమానం!
● చైర్‌పర్సన్ లేకుండానే జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం: ఓ వైపు మహిళోద్ధరణ కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూనే.. సీ్త్ర శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమని అంటూనే.. స్వాతంత్ర దినోత్సవం రోజున ఓ మహిళా బీసీ నాయకురాలికి కూటమి నాయ కులు తీవ్ర అవమానం కలిగించారు. పట్టణ ప్రథమ పౌరురాలైన పార్వతీపురం మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి లేకుండానే జెండా ఆవిష్కరణ కార్యక్రమం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేపట్టారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం చేపట్టిన జెండా ఆవిష్కరణకు ఇన్‌చార్జి కమిషనర్ శ్రీనివాసరాజు ఆమెను పిలిచినట్లే పిలిచి అవమానించారనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత ఉదయం 7.30 గంటల సమయానికి రావాలని ఒకసారి, మరలా తొమ్మిది గంటలకు రావాలని మరోసారి మున్సిపల్ చైర్‌పర్సన్ గౌరీశ్వరికి అధికారులు సమాచారం అందించారు. చెప్పిన ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రావాలంటూ.. జెండా ఆవిష్కరణ చేయకుండా సుమారు గంటకు పైగా ఆమెను వేచి ఉండేలా చేశారు. తర్వాత ఆమె లేని సమయంలో ఎమ్మెల్యేతో ఆవిష్కరణ చేయించారు. కమిషనర్ నిర్దేశించిన సమయానికి జెండా ఆవిష్కరణ చేయకుండా జాప్యం చేయడంతో చైర్ పర్సన్ గౌరీశ్వరి గంటన్నర పాటు నిరీక్షించి వెనుదిరిగారు. నిబంధనల ప్రకారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జెండా ఆవిష్కరణ చేయాల్సి ఉంది. తనను పిలిచి అవమానించిన ఇన్‌చార్జి కమిషనర్ శ్రీనివాసరాజుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చైర్‌పర్సన్ గౌరీశ్వరి తెలిపారు.