
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు రాష్ట్రంలోని అప్రజాస్వామ్య పరిస్థితులపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించాలి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు:
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి బదులుగా మంత్రి నారా లోకేశ్ రచించిన అప్రజాస్యామిక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన గృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఓ వైపు స్వాతంత్య్రదినోత్సవం చేసుకుంటున్న సమయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు, అధికారుల సాక్షిగా కూ టమి నేతలు రిగ్గింగ్‌కు పాల్పడిన చిత్రాలు పత్రిక లు, సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయన్నా రు. ఓటుహక్కు వినియోగించుకోనివ్వండని పోలీసుల కాలు పట్టుకున్నా, మహిళలందరూ తమను ఓటువేయనివ్వడం లేదని వాపోయినా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు కొత్త భాష్యం చెప్పినట్లయిందన్నారు. ఎన్నిల తీరు మారకపోతే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడు గు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. డబ్బు, అధికారబలం ఉన్నవారి కే పదవులు వరిస్తాయని, ప్రజాశీస్సులు ఉన్నవారికి పదవులు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే ఈవీఎంల వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి ఎన్నికల నిర్వహణ తీరువల్ల భవిష్యత్‌లో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఆంధ్రాలో సాగుతున్న అప్రజాస్వామ్య ఎన్నికల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టులు దృష్టిసారించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి రిగ్గింగ్ ఎన్నికలు నిర్వహించే బదులు జెడ్పీటీసీ పదవులను సైతం నామినేటెడ్ పదవుల వలే తమ పార్టీవారికి కట్టబెడితే సరిపోతుందని ఎద్దేవా చేశారు.
ఆ ఎన్నికలు రద్దు చేయాలి
అప్రజాస్వామికంగా సాగిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను తక్షణమే రద్దుచేయాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పింఛన్, రేషన్‌ను లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇచ్చేవారని గుర్తుచేశారు. నేడు నిత్యావసర సరుకులు కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి డిపోలకు వచ్చి సరుకులు మోసుకుని వెళ్లాల్సివస్తోందన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రతినెలా పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులతో పాటు వారెందుకు పాల్గొంటున్నారో చెప్పాలన్నారు.