
ఆటోడ్రైవర్ల నిరసన
మక్కువ: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు నిరసనగా ఆటోడ్రైవర్లు మక్కువ ప్రధాన రోడ్డుపై గురువారం ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని, ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల మెడకు ఉరి తాడు లాంటి జీఓ నంబర్ 21ను రద్దు చేయా లని కోరారు. అనతరం తహసీల్దార్ భరత్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మక్కువ ఆటో డ్రైవర్లు యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వై.నాయుడు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం అమలుతో ఆటోరంగం తీవ్రంగా దెబ్బతింటుందని, ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కార్యక్రమంలో చినబోగిలి, బొబ్బిలి, కోన, చెముడు, దుగ్గేరు, శంబర ఆటో స్టాండ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, గిరిజన సంఘం నాయకులు టి.ప్రభాకరరావు, సీఐటీయూ నాయకులు కష్ణారావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం రూరల్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం, ఎస్‌టీబీఎల్‌లో చోటుచేసుకుంది. అక్కడే అద్దెకు నివాసముంటున్న కొండల గాయత్రి(21) బుధవారం ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సీఐ నమ్మి గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మన్యం జిల్లా, వీరఘట్టం మండలానికి చెందిన మృతురాలు గాయత్రికి 2024 మార్చి నెలలో శంకరరావుతో వివాహమైంది. గాయత్రి భర్త అచ్యుతాపురం ఎంఎస్‌ఎంఈలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త ఉదయం 9.30 గంటలకు విధులకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి గాయత్రి వంటగదిలో చున్నీతో ఉరివేసుకుని మృతి చెందడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు గర్భం పోవడంతో పలుమార్లు ఇరుగుపొరుగు వారితో తన గర్భం పోయిందని చెబుతూ ఆవేదన చెందినట్టు విచారణలో తెలిసిందన్నారు. క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే ఆమె ఉరి వేసుకుని మృతి చెందినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసి, ఇతర కారణాలపైనా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.