
ఐదు రోజులూ అప్రమత్తం
సాక్షి, పార్వతీపురం మన్యం:
అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా, మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రానున్న ఐదు రోజులు వర్ష ప్రభావం ఉంటుందన్న విపత్తుల శాఖ సూచనలతో జిల్లా యంత్రాంగం ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఐదు రోజులు సెలవులు రద్దు చేస్తున్నట్లు జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలూ జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అత్యవసర వేళ కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఫోన్: 08963 293046ను ఆశ్రయించాలన్నారు. కొండవాలు, నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను, పాడైన గృహాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అల్పపీడనం ప్రభావంతో బుధవారం జిల్లాలో 19 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా జియ్యమ్మవలసలో 48.8, పార్వతీపురంలో 42.8, బలిజిపేటలో 42.4 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది. గురువారం కాస్త తెరిపిచ్చింది. భారీగా కురిసిన వర్షానికి పార్వతీపురం జిల్లా కేంద్రం జలమయం అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ముంచెత్తింది. బైపాస్ రోడ్డులో ఉన్న సాయిబాబా ఆలయంలోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. వర్షపు నీరుతో కలెక్టరేట్ ప్రాంగణమంతా చిన్నపాటి నీటి కొలనును తలపించింది. అందులోనే కొంతమంది వాహనదారులు తమ వాహనాలను శుభ్రం చేసుకోవడం గమనార్హం.