
ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రం
● ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్
డెంకాడ: ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రమని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో శుక్రవారం జాతీయ జెండాను కమాండెంట్ మలికా గార్గ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15న విముక్తి పొందిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వృథా కానివ్వరాదన్నారు. ఉత్తమ సేవలు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పత్రాలను అందేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు జి.లక్ష్మీనారాయణ, ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
కొమరాడ: కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన వుబ్బిశెట్టి చిట్టిబాబు(62) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు.. వుబ్బిశెట్టి చిట్టిబాబు తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం వర్షం కారణంగా పనిలేక వెళ్లలేదు. తన ఇంటి బయట విద్యుత్ వైర్ వేలాడుతుండగా ప్రమాదవశాత్తు తగిలి షాక్ గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
వీరఘట్టం: ఆర్థిక సమస్యలతో కె. రామకృష్ణ తోటపల్లి డ్యామ్‌లో దూ కి ఆత్యహత్య చేసుకున్నట్టు ఎస్.ఐ జి.కళాధర్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గ్రామానికి చెందిన రామకృష్ణ కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల తో భాద పడుతున్నాడు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అతని భార్య సంతోషి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఈ నెల 11న తోటపల్లి డ్యామ్‌లో దూకిన రామకృష్ణ శుక్రవారం ఉదయం తోటపల్లి ఎడమ కాలువలో ఒకటవ బ్రాంచ్‌లో కడకెల్ల సమీపంలో మృతదేహామై తేలాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.