
అనుమానాస్పదంగా ఎలక్ట్రీషియన్ మృతి
పెందుర్తి:
భార్యతో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సీఐ కేవీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు.. పెందుర్తి నటరాజ్ థియేటర్ సమీపంలోని నేల బావిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సీఐ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతుడు విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రావురు ప్రసాద్(25)గా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు కొన్నాళ్లుగా భార్యతో వివాదాల కారణంగా తల్లితో స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ప్రసాద్ మూడు రోజుల క్రితం పని మీద వెళుతున్నానని తల్లికి చెప్పి, తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణంతో మృతి చెందాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.