రాయగడ : జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జిఐఇటి) విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న కౌషిక్ పాత్రో (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గుణుపూర్‌లో గల వరుణ్ నగర్‌లో ఒక అద్దె ఇంటిలో ఉంటున్న ఆ విద్యార్థి సోమవారం నాడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టంకు తరలించారు. మృతుడు బాలేశ్వర్ జిల్లా సొరొ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు అతని కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు.
నీట మునిగి మహిళా రైతు మృతి
మల్కన్‌గిరి: నీట మునిగి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి యం.వి.79 పోలీసుస్టేషన్ పరిధిలోని భపాన్‌పల్లి పంచాయతీ లో సోమవారం చోటుచేసుకోగా ఎర్ర కుంజా (51) చనిపోయింది. ఈమె భర్తతో పొలం పని చేసి తిరిగి వస్తూ.. మార్గమధ్యలో ఉన్న చెరువులో స్నానం కోసం వెళ్లారు. అయితే చెరువులోకి వెళ్లిన ఆమె ఎప్పటికీ రాకపోవడంతో భర్త దుల మాడ్కమి అనుమానంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా ఆమె బట్టలు అక్కడే ఉన్నాయి. దీంతో దానితో చెరువులోకి దిగి గాలించగా ఎర్ర కుంజా శవమై తేలింది. సమాచారం తెలుసుకున్న యం.వి.79 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమేల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
బలభద్రునికి సోదరి సుభద్ర రాఖీ
భువనేశ్వర్: శ్రీ క్షేత్రం (పూరీ) నుంచి తులసి క్షేత్రంలో కొలువై ఉన్న అన్న బలభద్ర స్వామికి సోదరి దేవీ సుభద్ర రాఖీ తరలింపు కార్యక్రమం సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హై టెక్ గ్రూప్ ట్రస్టీ విశ్వరాజ్ పాణిగ్రాహి, పట్టొ రాఖీ సేవా పరిషత్ అధ్యక్షుడు హిమాన్షు శేఖర్ సాహు, సౌభాగ్య మంజరి సాహు, సుభ్రాంశు సాహు, భువనానంద దాస్ పూరీ గోవర్ధన పీఠం శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి నుంచి పట్టు రాఖీ అందుకున్న హై టెక్ మెడికల్ సముదాయంలో గణేష్ ఆలయంలో భద్రపరిచారు. ఆ రాఖీతో కేంద్రాపడాలో తులసీ క్షేత్రలో బలభద్ర స్వామి సన్నిధికి హై టెక్ సంస్థ ప్రాంగణం నుంచి శ్రీ మందిరం సీనియర్ సేవాయత్, సుభద్ర దేవీ బాడొగ్రాహి రామచంద్ర దాస్ మహా పాత్రో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం యాత్రగా బయలేరింది. ఈ సందర్భంగా గణపతి ఆలయ ప్రాంగణంలో హై టెక్ గ్రూప్ ట్రస్టీ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాదులు నిర్వహించారు. హై టెక్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి, మేనేజింగ్ ట్రస్టీ సురేష్ పాణిగ్రాహి, ట్రస్టీ డాక్టర్ రాకేష్ పాణిగ్రాహి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
గోడ కూలి మహిళలకు గాయాలు
రాయగడ: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రామనగుడ సమితి పరిధిలోని కండాజామ్ గ్రామంలో ఇంటి గోడ కూలి ఓ మహిళ గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గ్రామానికి చెందిన ద్రౌపది మండంగి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలొ ఒక్కసారిగా గోడ కూలి ఆమైపె పడింది. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను శిథిలాల నుంచి బయటకు తీశారు. అనంతరం అధికారులు ప్రాధమిక చికిత్స అందించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.


