హాస్టళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయండి

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

హాస్టళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయండి ● రాయగడలో రాష్ట్ర శిశు సంరక్షణ కమిషన్‌ పర్యటన

రాయగడ: విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని కొలనార సమితి పరిధిలోని రివల్‌కొన ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ హైస్కూల్‌ హాస్టల్‌లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర శిశు సంరక్షణ కమిషన్‌ అధ్యక్షురాలు బబితా పాత్రో బుధవారం పరిశీలించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో కౌన్సిలర్‌లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగష్టు 3వ తేదీన రివల్‌కొన పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటున్న పదో తరగతికి చెందిన విద్యార్థులు అదే హాస్టల్‌లో ఉంటున్న జూనియర్‌ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలను సందర్శించిన బబితా పాత్రొ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుని హాస్టల్‌ నుంచి తొలగించినట్లు తెలిపారు. పాఠశాలలో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉపాధ్యాయులకు ప్రత్యేక సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల్లో పనిచేయని సీసీ టీవీ కెమెరాల స్థానంలో వెంటనే కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం, నిద్ర వసతులు సక్రమంగా ఉన్నప్పటికీ భద్రత చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ప్రతీ హాస్టల్‌లో కౌన్సిలర్‌..

చిన్నారుల్లో పెరుగుతున్న ప్రతికూల ప్రవర్తనను నియంత్రించడంతోపాటు వారి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రంలోని ప్రతీ హాస్టల్‌లో కౌన్సిలర్‌ను నియమించే ప్రణాళిక ఉందని బబితా పాత్రొ తెలిపారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే కౌన్సిలర్‌ల లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మలేరియా నివారణకు మెరుగైన దొమతెరలు అందుబాటులో ఉంచాలని, ప్రాథమిక చికిత్స, అవసరమైన మందుల సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు..

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను కూడా బలొపేతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలను గుర్తించి కొత్త భవనాల నిర్మాణానికి రూ.11 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే అదనంగా మరో రూ. 6 లక్షలు కూడా కేటాయించే అవకాశం ఉందన్నారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రహరీ, ప్రత్యేక మరుగుదొడ్లు, వంటగది, తాగునీటి సదుపాయం, పిల్లలు ఆడుకునేందుకు స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సక్షమ్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతోపాటు అద్విక కార్యక్రమం ద్వారా పిల్లలకు పరిశుభ్రత, శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, హాస్టళ్లలో సిబ్బంది కొరతతోపాటు ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్‌, పీడీ, ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌ను సందర్శించిన ఇక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. రోగులు ఉంటున్న వార్డుల్లో పర్యటించి సౌకర్యాలపై ఆరా తీసారు. ఈ పర్యటనలో ఆమె వెంట ఎస్‌ఎస్‌డి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, బీజేపీ సేనియర్‌ నాయకుడు శివ శంకర్‌ ఉలక, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement