ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండున్నర కేజీల గంజాయితో ఒక యువకుడితో పాటు 15 ఏళ్ల బాలుడు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఏ–వేలిగోడు గ్రామానికి చెందిన మరియా కిల్‌బెర్ట్ రాజశేఖర్ అనే యువకుడు, ఒక 15 ఏళ్ల బాలుడు ఇరువురూ జల్సాలకు అలవాటుపడ్డారు. వీరికి తమిళనాడు దిండిగల్ జిల్లా ఫలనీ బైపాస్ ప్రాంతంలో గంజాయి వ్యాపారం చేసే కాళిదాస్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో గంజాయి వ్యాపారి సూచించినట్లు ఒడిశాలో బలియాగడ గ్రామం సమీపంలోని హెచ్‌సీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటున్న రామస్వామి దొర వద్దనుంచి 2.500 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం వీరిరువురు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ నుంచి రైలు గుండా తమిళనాడు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టేషన్‌కు వస్తుండగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్దనుంచి గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో యువకుడిని సోంపేట కోర్టుకి తరలించగా, బాలుడుని జువైనల్ కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు సిబ్బంది పాల్గొన్నారు.


