విద్యార్థుల గోడు పట్టించుకోరా..? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల గోడు పట్టించుకోరా..?

Sep 3 2026 12:25 AM | Updated on Sep 3 2026 12:25 AM

● ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థుల నిరసన ● డీఆర్‌వలస కూడలి వద్ద బైఠాయింపు ● పోలీసులు సముదాయించడంతో శాంతించిన విద్యార్థులు

● ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థుల నిరసన ● డీఆర్‌వలస కూడలి వద్ద బైఠాయింపు ● పోలీసులు సముదాయించడంతో శాంతించిన విద్యార్థులు

జి.సిగడాం: మండలంలోని డీఆర్‌వలస వద్ద విద్యార్థులు బస్సు కోసం బుధవారం రోడ్డెక్కారు. రాజాం–విజయనగరం ప్రధాన రహదారి మధ్యలో డీఆర్‌వలస కూడలి ఉంది. ఈ కూడలికి సర్వేశ్వరపురం, డి.బొండపల్లి, దాలెమ్మరాజువలస, గదబపేట, ముషినివలస, శిరిగిడిపేటకు చెందిన ప్రయాణికులు, విద్యార్థులు వస్తుంటారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ఈ సెంటర్‌ నుంచే అటు విజయనగరం.. ఇటు రాజాం తదితర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలుపుదల చేయడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రైవేట్‌ వాహనాలు లేక, ఇటు ఆర్టీసీ బస్సులు ఆపక తిరిగి ఇంటిముఖం పడుతున్నారు. కాస్తో కూస్తో స్తోమత ఉన్నవారు ఎలాగోలా ప్రైవేట్‌ వాహనాలు ద్వారా కాలేజీలకు వెళ్తున్నారు. మిగిలినవారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బుధవారం వీరంతా అటు విజయనగరం, ఇటు రాజాం వెళ్లే ఆర్టీసీ బస్సులకు అడ్డంగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ కూడలిలో ఎందుకు బస్సులు ఆపడం లేదు.. బస్సు పాసులు ఇచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్లను ప్రశ్నించారు. అయితే బస్సులు ఖాళీ ఉండడం లేదని, కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, ఈ కారణంగానే కూడలి వద్ద ఆపలేకపోతున్నామని సమాధానం చెప్పారు. గతంలో మాదిరిగా ఆర్టీసీ సర్వీసులు లేవని, తగ్గించేశారని చెప్పడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. తమ సమస్య పరిష్కరించేవరకూ ఏ బస్సును కదలనీయమని రోడ్డుపై బైఠాయించారు.

పోలీసుల రంగ ప్రవేశం

డీఆర్‌వలస సెంటర్‌లో విద్యార్థుల నిరసన విషయాన్ని తెలుసుకున్న జి.సిగడాం పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఈ నిరసన కార్యక్రమం కారణంగా డీఆర్‌వలస కూడలికి రెండు వైపులా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులతో పోలీసులు మాట్లాడారు. ఆర్టీసీ సర్వీసులు ఉదయం, సాయంత్రం సమయాల్లో పెంచడంతో పాటు ప్రతీ ఆర్టీసీ బస్సూ విద్యార్థుల కోసం డీఆర్‌వలస కూడలిలో నిలుపుదల చేయాలని, ఎంత రద్దీగా ఉన్నా బస్సును ఆపాలని కోరారు. ఆర్‌టీసీ సిబ్బంది అందుకు అంగీకరించడంతో నిరసన తాత్కాలికంగా సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement