రాయగడ: ఎస్‌ఐఆర్–2026లో భాగంగా ఓటరు జాబితా పునః సమీక్ష, ధ్రువీకరణ, సూపర్ చెకింగ్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐడీసీఓ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్నికల జాబితా పరిశీలకుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లాలో రెండోసారి పర్యటించి, వివిధ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్–2026 పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. పర్యనటలో భాగంగా తొలుత గుణుపూర్ సమితిలోని న్యూకాలనీని సందర్శించిన డాక్టర్ రెడ్డి సూపర్ చెకింగ్‌కు ఎంపికై న ఫారం–7 దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి దరఖా స్తు పరిశీలన విధానం, అవసరమైన పత్రాలు, సూపర్ చెకింగ్ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని పద్మపూర్ సమితిలో పర్యటించారు. సమితిలోని అఖుసింగి–2, రామనగుడ సమితిలోని మోసారిగుడ ప్రాంతాలను సందర్శించి సూపర్ చెకింగ్‌కు ఎంపికై న ఫారం–6 దరఖాస్తులను పరిశీలించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం..
పర్యటన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్‌ఐఆర్–26 ప్రస్తుత దశ, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి, అభ్యంతరాల స్వీకరణ, విచారణ ప్రక్రియపై చర్చించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతీ దశను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్–2026లో ఫారం–6, ఫారం–7 దరఖాస్తు ల పరిశీలన, సూపర్ చెకింగ్ కొనసాగుతున్నాయి. తదుపరి దశంలో అభ్యంతరాల స్వీకరణ, విచారణ పూర్తి చేసి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 21న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, గునుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


