జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్ర, కొట్‌పాడ్, బొయిపరిగుడ సమితుల్లో బిజూ కేబీకే పథకంలో స్ట్రీట్ లైట్ల కొనుగోలు వ్యవహారంలో అనేక ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని కొరాపుట్ జిల్లా యువ సంఘటన ఆరోపించింది. కొరాపుట్ జిల్లా యువ సంఘటన జిల్లా ఆర్గనైజర్ రవీంధ్ర కుమార్ మహాపాత్రో నేతృత్వంలో యువసంఘటన కార్యకర్తలు కొరాపుట్ రీజనల్ విజిలెన్స్ విభాగం జయపురం ఎస్పీని కలిసి సమితుల్లో జరుగుతున్న అవినీతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో బిజూ కేబికె యోజనలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు బిల్లు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే అనేక చోట్ల లైట్లే లేవని పలు చోట్ల లైట్లు వెలగటం లేదని ఆరోపించారు. కుంద్రా సమితిలో 368 స్ట్రీట్ లైట్లు కోసం రూ.74.36 లక్షలు, ఎమ్మెల్యే నిధి నుంచి 284 స్ట్రీట్ లైట్ల కోసం రూ.57.04 లక్షలు ఖర్చు చేశారని, కానీ నేడు వాటిలో సగం కూడా లైట్లు లేవని ఆరోపించారు. అలాగే కొట్‌పాడ్ సమితిలో 25 గ్రామ పంచాయతీల్లో 425 స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కోసం రూ.89.25 లక్షలు మంజూరు చేయగా, బొయిపరిగుడ సమితిలో 304 స్ట్రీట్ లైట్లు నెలకొల్పేందుకు రూ.63.74 లక్షలు మంజూరు కాగా వాస్తవంగా అనేక చోట్ల లైట్లు ఏర్పాటు కానరాలేదని మెమొరాండంలో ఆరోపించారు. అలాగే బొరిగుమ్మ సమితిలో ప్రతి స్ట్రీట్ లైట్ రూ.8 వేలు చొప్పన ఖరీదు చేయగా కుంధ్ర, కొట్‌పాడ్, బొయిపరిగుడ సమితుల్లో రూ.21 వేలు చొప్పున ఖరీదు చేశారని ఆరోపిస్తూ అంత ఎక్కువ పైకానికి ఎలా ఖరీదు చేశారని ప్రశ్నించారు. నియమం ప్రకారం టెండర్లు పిలిచి ఖరీదు చేయాలని, అయితే టెండర్లు పిలవ కుండా ఎలా ఖరీదు చేశారని ప్రశ్నించారు.


