● వైస్ చైర్మన్ కూడా..
రాయగడ: జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుణుపూర్ మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ సన్నో గౌడోలు తమ మద్దతుదారులతో కలిసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఇది జిల్లాలో రాజకీయ సమీకరణాలను మార్చే పరిణామంగా మారింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ సమక్షంలో వారు కాషాయం కండువ కప్పుకున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన మమత గౌడో, సన్నో గౌడోలు ప్రజల మద్దతుతో విజయం సాధించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా పదవులను చేపట్టారు. ఇప్పుడు అధికారిక బీజేపీలో చేరడంతో గుణుపూర్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ ప్రభావం మరింత పెరగనున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని గుణుపూర్, రాయగడ, బిసంకటక్ శాసనసభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ చేరిక కీలక మైలురాయిగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భామిస్తున్నారు. స్థానికంగా బలమైన నాయకత్వం కలిగిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడం వల్ల పార్టీ గ్రామీణ, పట్టణ స్థాయిలో సంస్థాగత బలాన్ని మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ చేపడుతున్న విస్తరణ వ్యూహానికి గుణుపూర్ నుంచి ఊపిరి లభించనట్లేనని, ఈ పరిణామం జిల్లాలోని రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లొ చర్చ సాగుతుంది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలొ జరిగిన చేరికల్లో మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్లతోపాటు పది మంది వార్డు కౌన్సిలర్లు, సమితి చైర్మన్, సమితి సభ్యులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చేరికల సమయంలో రాయగడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపిఆనంద్, శివశంకర్ ఉలక ఉన్నారు.


