పర్లాకిమిడి: అమృత్‌భారత్ స్టేషన్ల యోజన పథకం కింద రాష్ట్రంలో పునరాభివృద్ధి పనులు పూర్తిచేసుకున్న ఏడు రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవాలు శుక్రవారం మధ్యాహ్నం జరిగాయి. వాటిలో పర్లాకిమిడిలో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లో జలంధర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఈ వర్చువల్ కార్యక్రమాన్ని పర్లాకిమిడి రైల్వే స్టేషన్‌లో రాయగడ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ ఏర్పాటుచేసి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తదితరులు పాల్గొన్నారు. తొలుత కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రారంభగీతం పాడారు, అనంతరం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సంబల్‌పురి నాట్యం, రాయగడ చిన్నారుల కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే రూపేష్ శ్రీజగన్నాథునికి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయగడ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్ మాట్లాడుతూ, పర్లాకిమిడి మహారాజా గౌరచంద్ర గజపతి 1900 సంవత్సరంలో ఏడు లక్షలతో పర్లాకిమిడి రైల్వే స్టేషన్‌ను నిర్మించి ప్రారంభించగా, తదనంతరం ఆయన కుమారుడు కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ 1929–31లో నౌపడకు పొడిగించారని.. ప్రస్తుతం ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయలతో రైల్వే స్టేషన్ నిర్మించామన్నారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ, పర్లాకిమిడి నుండి విశాఖపట్నం, హైదరాబాద్, భువనేశ్వర్, కోల్‌కతాకు నూతన ట్రైన్లు వేయాలని, అలాగే పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్రగజపతి దేవ్ ప్రతిమూర్తిని స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, కట్రా, పంజాబ్‌కు క్రొత్త రైలుబండితో పాటు, దేశంలో 75 పునర్మించిన రైల్వే స్టేషన్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కార్యక్రమం అనంతరం అమృత్ భారత్ స్టేషన్లనపై రాయగడ డివిజన్ నిర్వహించిన వివిధ సెల్ఫీ ఫొటోలు, రచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.


