భువనేశ్వర్: పూరీలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణంతో తుఫాను వంటి తీవ్రతర పరిస్థితి అలముకుంది. వాతావరణ శాఖ ముందస్తుగా జారీ చేసిన సమాచారం ప్రకారం ఈ జిల్లా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల వైశాఖి వాతావరణం తాండవించింది. జగన్నాథుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు బెంబేలెత్తారు. భారీ వర్షం, ఉరుములు, ఈదురు గాలులతో శ్రీ మందిరం పరిసరాల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూరీ జిల్లా కొణాస్ గ్రామంలో పిడుగుపాటుకు ఒక రైతు మృతి చెందాడు. మృతుడిని బంధముండ గ్రామానికి చెందిన సిద్దియా ధోలేరసింఘాగా గుర్తించారు.
బడికి తాళం
మల్కన్‌గిరి: గౌడగూఢ పంచాయతీ ఎంవీ 9 గ్రామం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ అందకపోవడంతో గ్రామస్తులు బుధవారం బడికి తాళం వేశారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్ సామంతరాయ్ కొద్ది నెలల కిందట 7వ తరగతి విద్యార్థిని శారీరకంగా, మానసికంగా వేధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ఆయనపై వేటు వేసింది. ఆయన స్థానంలో విధుల్లో ఉన్న మహిళా ఉపాధ్యాయురాలికి బాధ్యతలు అప్పగించింది. ఆమె సక్రమంగా చేయకపోవడంతో మరో టీచర్ సరస్వతి పూజారికి బాధ్యతలు అప్పగించారు. అయితే బుధవారం పాఠశాల ముందు పిల్లలను కూర్చోబెట్టి స్థానికులు నిరసన తెలిపారు. ఇక్కడ 8వ తరగతి లో 46 మంది చదువుతున్నారు. ఇక్కడ పాస్ అయిన వారు 9వ తరగతిలో చేరేందుకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రక్తదానం.. ప్రాణదానం
పర్లాకిమిడి: రక్తదానం.. ప్రాణదానంతో సమానమని అదనపు జిల్లా మాజిస్ట్రేట్ ఫల్గుణీ మఝి అన్నారు. ఒడియా దివాస్ పక్షోత్సవాల సందర్భంగా భారతీయ రెడ్ క్రాస్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఫల్గుణీ మఝి ప్రారంభించారు. రక్తదాతల నుంచి 38 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు బ్లడ్ బ్యాంకు ఫార్మాసిస్టు ఖగేశ్వర బెహరా తెలిపారు. సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా పరిషత్ అదనపు సీడీఓ పృథ్వీరాజ్ మండల్, జిల్లా అబ్కారీశాఖ అధికారి ప్రదీప్ సాహు, డాక్టర్ అనిల్ ఆచార్య పాల్గొన్నారు. రక్తదానం చేసిన దాతలను అభినందించారు.
భార్యను హతమార్చిన భర్త
భువనేశ్వర్: స్థానిక స్వస్తిక్ నగర్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఒక దారుణ హత్య ఘటన నివాసితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేవరాజ్ అనే రిటైర్డ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తన భార్య ప్రియంబద షడంగి గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపణ. పదవీ విరమణ చేసిన అకౌంటెంటు జనరల్ కార్యాలయం ఉద్యోగి అయిన దేవరాజ్ ఉద్యోగ విరమణ తర్వాత గత 2 సంవత్సరాల నుంచి తన భార్యతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. రక్తసిక్తమైన పడక గదిలో రక్తపు మడుగులో ప్రియంబద పడి ఉన్నట్లు ఇరుగు పొరుగు వారి దృష్టికి రావడంతో ఎయిర్ ఫీల్డు ఠాణా పోలీసులకు సమాచారం చేరదీశారు. వీరి సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పర్యవేక్షించడంతో రక్తపు మడుగులో మహిళ మృత దేహం ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేవరాజ్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి. సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం, కమిషనరేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య వెనుక కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. కానీ కుటుంబ కలహాలే ఈ విషాద ఘటనకు దారి తీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.


