
చీఫ్ ఇంజినీర్ల దృష్టికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమస్య
రాయగడ: పట్టణం నడిబొడ్డున ఉన్నఫ్లైఓవర్ బ్రిడ్జి సమస్యను బీజేపీ ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కాలీరాం, కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘురాం మచ్చలు ఎన్‌హెచ్ అడిషనల్ చీఫ్ ఇంజినీర్ నళినీరాణి సబర్ దృష్టికి శుక్రవారం తీసుకువెళ్లారు. కొన్నాళ్లుగా రాయగడలోని ఫ్‌లైఓర్ బ్రిడ్జి నిర్వహణ లోపం కారణంగా ప్రమాదకరంగా మారిందని వివరించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కపిలాస్ కూడలి వరకు బ్రిడ్డి అత్యంత దయనీయంగా మారిందని, అడుగడుగా గుంతలతో ఉండటంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. బ్రిడ్జి దాదాపు శిథిలావస్థకు చేరుకోవడంతొ ఎప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న భయాందోళనలతో వాహన చోదకులు బితుకుబితుకుమంటూ వాహనాలను నడుపుతున్నారని వివరించారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు ఈ బ్రిడ్జి నుంచే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. బ్రిడ్జి మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా జరిగిందని వివరించారు. అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని కోరారు.